CSK vs KKR: కోల్‌కతా ఆశలపై నీళ్లు చల్లిన చెన్నై సూపర్ కింగ్స్

Sunday, November 29, 2020 01:15 PM Sports
CSK vs KKR:  కోల్‌కతా ఆశలపై నీళ్లు చల్లిన చెన్నై సూపర్ కింగ్స్

అసలైన మ్యాచ్ ల్లో చతికిలపడిన చెన్నై అనామక మ్యాచ్ ల్లో (CSK vs KKR Stat Highlights) సత్తా చూపిస్తోంది. గత మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసిన సూపర్‌కింగ్స్‌ తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను (CSK vs KKR Stat Highlights Dream11 IPL 2020) చిత్తు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి చెన్నై తప్పుకున్న సంగతి విదితమే. ఇక నాకౌట్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పని సరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు షాక్‌ తగిలింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై (Chennai Super Kings) 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72) అర్ధ శతకంతోపాటు జడేజా (11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 31 నాటౌట్‌) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో చెన్నై వరుసగా రెండో మ్యాచ్‌ నెగ్గింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knight Riders) 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది. నితీశ్‌ రాణా (61 బంతుల్లో 87; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. తొలి బంతి పడగానే శుబ్‌మన్‌ గిల్‌ బౌండరీతో కోల్‌కతాకు మంచి ఆరంభమిచ్చాడు.  నితీశ్‌ రాణా కూడా ఓ ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్లో 13 పరుగులొచ్చాయి. అయితే సామ్‌ కరన్, ఇన్‌గిడి కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో తర్వాత 4 ఓవర్లలో 20 పరుగులే వచ్చాయి. ఇక ఆరో ఓవర్‌ను రాణా రఫ్ఫాడించాడు. సాన్‌ట్నర్‌ బౌలింగ్‌లో వరుసగా 4, 4, 6తో 15 పరుగులు పిండుకున్నాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో గిల్‌ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), సునీల్‌ నరైన్‌ (7) అవుట్‌ కావడంతో రన్‌రేట్‌ మందగించింది. కాసేపు నితీశ్‌తో జతకలిసిన రింకూ సింగ్‌ (11 బంతుల్లో 11; 1 ఫోర్‌) కూడా ఎక్కువ సేపు నిలువకపోయినా... ఉన్నంతసేపయినా ధాటిగా ఆడలేకపోయాడు. 

తొలి 50 పరుగుల్ని 6.2 ఓవర్లలో చేసిన కోల్‌కతా రెండో 50 (100) పరుగులు చేసేందుకు మరో 8 ఓవర్లు పట్టింది. ఇలా ఆలస్యంగా... 15వ ఓవర్లో మూడంకెల స్కోరును అధిగమించిది. అప్పటిదాకా నింపాదిగా ఆడుతున్న నితీశ్‌ తర్వాత ఒక్కసారిగా చెలరేగాడు. చెన్నై స్పిన్నర్‌ కరణ్‌ శర్మ వేసిన 16వ ఓవర్లో డీప్‌ మిడ్‌వికెట్, డీప్‌ స్క్వేర్‌లెగ్, లాంగాన్‌ల మీదుగా వరుసగా మూడు సిక్సర్లు బాదేశాడు. దీంతో ఆ ఓవర్లోనే కోల్‌కతా ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 19 పరుగులు వచ్చాయి. మరుసటి ఓవర్ పేసర్‌ దీపక్‌ చహర్‌ వేయగా... 17వ ఓవర్లో రాణా రెండు బౌండరీలు కొట్టాడు. ఇతని జోరుకు 18వ ఓవర్లో ఇన్‌గిడి బ్రేకువేయగా... ఆఖరి ఓవర్లలో  మోర్గాన్‌ (15), దినేశ్‌ కార్తీక్‌ ( 10 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు) బౌండరీలతో స్కోరు పెంచారు. మొదటి 15 ఓవర్లు ఆడి 106/3 స్కోరు చేసిన నైట్‌రైడర్స్‌ చివరి 5 ఓవర్లలో 66 పరుగులు చేసింది.
 
లక్ష్యఛేదనకు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి ఓవర్లో పరుగులు చేసేందుకు ఇబ్బందిపడ్డా... రెండో ఓవర్‌ నుంచి సిక్స్, మూడో ఓవర్లో బౌండరీలతో జోరందుకుంది. వాట్సన్‌ స్క్వేర్‌లెగ్‌ మీదుగా సిక్సర్‌ బాదగా... తర్వాత ఓవర్లో రుతురాజ్, వాట్సన్‌ చెరో ఫోర్‌ కొట్టారు. వరుణ్‌ చక్రవర్తి వేసిన ఆరో ఓవర్లో రుతురాజ్‌ లాంగాఫ్‌లో భారీ సిక్సర్‌ బాదేశాడు. పవర్‌ ప్లేలో వికెట్‌ కోల్పోకుండా చెన్నై 44 పరుగులు చేసింది. జట్టు స్కోరు 8వ ఓవర్లో 50 పరుగులకు చేరగా... అదే ఓవర్లో వాట్సన్‌ (14)ను చక్రవర్తి పెవిలియన్‌కు పంపాడు. రుతురాజ్‌కు రాయుడు జతయ్యాడు. నితీశ్‌ రాణా వేసిన పదో ఓవర్లో వరుసగా రాయుడు వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. 16 పరుగులు రావడంతో జోరు తగ్గిన చెన్నైలో జోష్‌ నింపాడు. ఆ తర్వాత ఓవర్‌ను రుతురాజ్‌ తన వంతుగా బాదేశాడు. ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో 4, 6 కొట్టాడు. 37 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రుతురాజ్‌ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 12వ ఓవర్లో రాయుడు కూడా కవర్స్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదాడు. చెన్నై 100 పరుగులకు చేరుకుంది. ఇలా మెరుపులతో సాగిపోతున్న చెన్నై స్వల్పవ్యవధిలో కష్టాలెదురయ్యాయి. మొదట రాయుడు, ఆరు బంతుల తేడాతో కెప్టెన్‌ ధోని ఔటయ్యారు. చెన్నై విజయానికి 32 బంతుల్లో ఇంకా 52 పరుగులు కావాలి.

రవీంద్ర జడేజా క్రీజులోకి రాగా ఆఖరి 12 బంతుల్లో 30 పరుగులు చేయాలి. 19వ ఓవర్‌ వేసిన ఫెర్గూసన్‌ లయతప్పాడు. దీన్ని అనువుగా మలచుకున్న జడేజా రెచ్చిపోయాడు. 4, 3, 6, 4 చకచకా పరుగులు జతచేశాడు. వైడ్, నోబాల్‌తోకలిపి ఫెర్గూసన్‌ 20 పరుగులిచ్చాడు. ఆట ఆఖరి ఓవర్‌కు చేరింది. చెన్నై 10 పరుగులు చేయాల్సివుండగా... కమలేశ్‌ నాగర్‌కోటి 0, 2, 1, 0 డాట్‌ బాల్స్‌తో ఒత్తిడి పెంచాడు. 2 బంతుల్లో 7 పరుగులు చేయాల్సిన దశలో కాస్త ఉత్కంఠ రేగినా... జడేజా డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా సిక్స్‌ బాదేశాడు. ఇక బంతి మిగలగా పరుగు చేస్తే సరిపోతుంది. కానీ దీన్ని కూడా జడేజా లాంగాన్‌ మీదుగా సిక్సర్‌ బాదేయడంతో చెన్నై గెలిచి కోల్‌కతాను ముంచింది.  

స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: గిల్‌ (బి) కరణ్‌ శర్మ 26; నితీశ్‌ రాణా (సి) స్యామ్‌ కరన్‌ (బి) ఇన్‌గిడి 87; నరైన్‌ (సి) జడేజా (బి) సాన్‌ట్నర్‌ 7; రింకూ సింగ్‌ (సి) రాయుడు (బి) జడేజా 11; మోర్గాన్‌ (సి) రుతురాజ్‌ (బి) ఇన్‌గిడి 15; దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 21; రాహుల్‌ త్రిపాఠి (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172.
వికెట్ల పతనం: 1–53, 2–60, 3–93, 4–137, 5–167.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 3–0–31–0, స్యామ్‌ కరన్‌ 3–0–21–0, ఇన్‌గిడి 4–0–34–2, సాన్‌ట్నర్‌ 3–0–30–1, జడేజా 3–0–20–1, కరణ్‌ శర్మ 4–0–35–1.  

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: వాట్సన్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 14; రుతురాజ్‌ (బి) కమిన్స్‌ 72; రాయుడు (సి) నరైన్‌ (బి) కమిన్స్‌ 38; ధోని (బి) వరుణ్‌ 1; స్యామ్‌ కరన్‌ (నాటౌ ట్‌) 13; జడేజా (నాటౌట్‌) 31; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 178.  
వికెట్ల పతనం: 1–50, 2–118, 3–121, 4–140. 
బౌలింగ్‌: కమిన్స్‌ 4–0–31–2, నాగర్‌కోటి 3–0–34–0, నరైన్‌ 4–0–23–0, ఫెర్గూసన్‌ 4–0–54–0, వరుణ్‌ 4–0–20–2, నితీశ్‌ రాణా 1–0–16–0.

For All Tech Queries Please Click Here..!