BCCI Earned Rs 4000 Crore: ఐపీఎల్ 2020 ద్వారా రూ. 4 వేల కోట్లను ఆర్జించిన బీసీసీఐ 

Sunday, January 3, 2021 04:15 PM Sports
BCCI Earned Rs 4000 Crore: ఐపీఎల్ 2020 ద్వారా రూ. 4 వేల కోట్లను ఆర్జించిన బీసీసీఐ 

యూఏఈ వేదికగా నిర్వహించిన ఐపీఎల్‌-13వ సీజన్‌కు గానూ బీసీసీఐ బోర్డు సుమారు 4 వేల కోట్ల రూపాయాల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమల్‌ వెల్లడించారు. అదే విధంగా గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ వ్యూయర్‌షిప్‌ కూడా 25 శాతం మేర పెరిగిందని పేర్కొన్నారు. కాగా కరోనా దెబ్బకు క్రీడా ఈవెంట్లన్నీ వాయిదా పడ్డ వేళ ఐపీఎల్‌ నిర్వహణపై కూడా సందేహాలు తలెత్తిన విషయం తెలిసిందే. 

కోవిడ్‌ విజృంభణ నేపథ్యంలో మార్చి 29న మొదలు కావాల్సిన ఐపీఎల్‌-2020 సీజన్‌ను తొలుత వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్‌-జులై నెలల్లో టోర్నీ నిర్వహణకు సన్నాహాలు చేసినా సాధ్యం పడకపోవడంతో.. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేద్దామని బీసీసీఐ పెద్దలు భావించారు. అయితే టోర్నీ నిర్వహణకు యూఏఈ అనుకూలమని భావించిన బోర్డు.. అక్కడి అధికారులతో సంప్రదించగా సానుకూల స్పందన లభించింది. దీంతో కోవిడ్‌ నిబంధనల నడుమ సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు కొనసాగిన టోర్నీని బీసీసీఐ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్న బోర్డుగా పేరొందిన బీసీసీఐ భారీ ఎత్తున ఆదాయం గడించినట్లు అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు.

ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా 1800 మందికి సుమారు 30 వేల మేర కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాం. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన పక్షంలో వారు కోలుకునేంత వరకు అన్ని రకాల చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. క్వారంటైన్‌ కోసం సుమారు 200 గదులు బుక్‌ చేశాం’’ అని అరుణ్‌ ధుమల్‌ పేర్కొన్నారు. కాగా ఐపీఎల్‌-13వ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ముంబై ఇండియన్స్‌ ట్రోఫీని ఎగురేసుకుపోయిన సంగతి తెలిసిందే. తద్వారా ఐదుసార్లు ఐపీఎల్‌ విజేతగా నిలిచిన జట్టుగా రోహిత్‌ సేన చరిత్ర సృష్టించింది.

For All Tech Queries Please Click Here..!