తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో బీజేపీకి చాన్స్ ఉందా... నోటాను దాటని కమలం మాటలు కోటలు దాటుతున్నాయా..

Saturday, January 2, 2021 01:00 PM Politics
తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలో బీజేపీకి చాన్స్ ఉందా... నోటాను దాటని కమలం మాటలు కోటలు దాటుతున్నాయా..

దుబ్బాక ఎన్నికలో విజయం తర్వాత బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఉత్సాహం లభించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇక తమకు తిరుగు లేదని, భవిష్యత్తులో తమిళనాడు సహా ఏపీ, తెలంగాణ, కేరళలో సైతం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆ పార్టీ నేతలు అంటున్నారు. అటు తిరుపతిలో సిట్టింగ్ ఎంపీ, వైసిపి నేత బల్లి దుర్గాప్రసాద్‌ రావు (64) మరణం తర్వాత ఆ సీటులో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఇదిలా ఉంటే గత కొంత కొన్ని దశాబ్దాలుగా సిట్టింగ్ ప్రజాప్రతినిధులు చనిపోతే, ఆ స్థానాన్ని పార్టీలకు అతీతంగా వారి కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా చట్ట సభలకు పంపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఆనవాయితీని రాజకీయ పక్షాలు తుంగలో కలిపేశాయి. తాజాగా తెలంగాణలోని దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సోలిపేట రామలింగారెడ్డి అస్తమయం అనంతరం ఆయనపై ప్రతిపక్ష పార్టీలన్నీ సోలిపేట కుటుంబ అభ్యర్థిపై పోటీచేశాయి. అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. అయితే ఇదే ఊపుతో ప్రస్తుతం ఏపీలో కూడా తిరుపతి పార్లమెంటరీ స్థానం ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విజయోత్సాహంతో తిరుపతిలో ప్రకటన చేశారు. అయితే బీజేపీ కార్యకర్తలకు ఇది శ్రవణానందకరంగా ఉండొచ్చు. కానీ వాస్తవాలకు భిన్నంగా రాజకీయాలు ఉన్నాయని గమనించాల్సి ఉంది.

ఏపీలో నోటా వెనుకే బీజేపీ

బీజేపీ ఏపీలో సోము వీర్రాజు అధ్యక్షుడు అయ్యాక ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. తరచూ ప్రెస్ మీట్లతోనూ, సవాళ్లతోనూ సెన్సేషన్ నే నమ్ముకొని ముందుకు వెళుతోంది. ముఖ్యంగా హిందుత్వ భావాలన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి ఉత్తరప్రదేశ్ తరహాలో రాజకీయం చేయాలని చూస్తోంది. ముఖ్యంగా అంతర్వేదిలో రథం దగ్ధమైన సందర్భంగా దాన్ని అదునుగా తీసుకొని బీజేపీ ఉద్యమం నడపాలని చూసింది. కానీ ఆ విషయంలో కాస్త అనుకున్నంత ప్రజా స్పందన కరువయ్యింది. మరి బీజేపీకి నిజానికి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూస్తే నోటాతో పోటీపడిందనే చెప్పాలి. చాలా నియోజక వర్గాల్లో బీజేపీ పార్టీ 4, 5 స్థానాలకు పరిమితం అయ్యింది. కేవలం 2,63,849 ఓట్లు సాధించి  0.84 ఓట్ల శాతంలో 5 స్థానంలో నిలిచింది. అయితే నోటాకు 4 లక్షల పైచిలుకు ఓట్లు పడ్డాయంటే, ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.  

తిరుపతిలో అవకాశాలు ఉన్నాయా...

ఇక తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఏకంగా గెలుపు గుర్రం తానే అని ధీర వచనాలు పలుకుతోంది. అయితే వాస్తవానికి బీజేపీ అసలు పోటీలోనే లేదన్న సంగతి గుర్తుంచుకోవాలని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2019 జనరల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు ఏకంగా 2.2 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపు సాధించగా, బీజేపీ అసలు పోటీ కూడా చేయలేదు. అయితే 2014లో మాత్రం టీడీపీ మద్దతుతో బీజేపీ తరపున కారుమంచి జయరాం పోటీ చేయగా రెండో స్థానంలో నిలిచారు. తిరుపతి చరిత్రలో 1999లో మాత్రం తొలిసారి బీజేపీ తరపున నందికాపు వెంకటస్వామి ఎంపీగా గెలుపొందారు. అయితే టీడీపీ మద్దతు లేకుండా నిలబడిన ప్రతీసారి బీజేపీకి వచ్చిన ఓట్లు 2 శాతం కూడా దాటలేదు. ఇక వైఎస్సార్సీపీ ప్రభంజనం నడుస్తున్న వేళ బీజేపీ ఒంటరి పక్షిగా పోటీచేయడం దాదాపు ఆత్మహత్యా సదృశ్యమే అని విశ్లేషకులు అంటున్నారు. అటు మిత్ర పక్షం జనసేనను కూడా సంప్రదించకుండా బీజేపీ చేసిన ప్రకటనతో ఆ పార్టీ శ్రేణులు సైతం నవ్వుకునే పరిస్థితి ఏర్పడింది.

రాజన్న రాజ్యం దిశగా జగన్ పాలన...

రాజన్న రాజ్యం, నవరత్నాలే ప్రధాన మేనిఫెస్టోగా ముందుకు వచ్చిన జగన్ పాలన ప్రస్తుతం ఏపీలో బలంగా ముందుకు సాగుతోంది. ఇప్పుడున్న పరిస్తితుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చిన కనీసం 3 నుంచి 4 లక్షల ఓట్ల మెజారిటీతో తిరుపతి ఎంపీ స్థానం వైసీపీ గెలవడం ఖాయమని చెబుతున్నారు విశ్లేషకులు. అయితే అటు టీడీపీ సైతం ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకొని నష్టపోయే బదులు పోటీ నుంచి తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని భావిస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో వ్యతిరేకత అటుంచి నవ్వుల పాలు చేస్తున్నాయి.  

For All Tech Queries Please Click Here..!