Ramateertham Temple: రామతీర్థంలో అసలేం జరిగింది? జరుగుతోంది?

Monday, March 1, 2021 01:00 PM Politics
Ramateertham Temple: రామతీర్థంలో అసలేం జరిగింది? జరుగుతోంది?

Amaravati, Jan 3: ఏపీలో రామతీర్థం ఘటన రాజకీయ రంగును పులుముకుంది. అన్ని పార్టీలు దీన్ని రాజకీయ అస్త్రంగా మార్చుకునేందుకు అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ హైటెన్సన్ కొనసాగుతోంది. హైందవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలో రామతీర్థంకు (Ramateertham Temple) పిలుపు ఇచ్చింది. అలాగే జనవరి 5వ తేదీన జనసేన-బీజేపీ రామతీర్థం ధర్మయాత్రను చేపట్టనున్నాయి. దీంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు బీజేపీ నేతలు, కార్యకర్తలు తమ నిరసన శిభిరం తొలగింపుతో ఆందోళనకు దిగుతున్నారు. 

ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థంలో పర్యటించారు. నేడు ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ (Minister for Endowments Vellampalli Srinivasa Rao), పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister for Municipal Administration Botcha Satyanarayana) ఆదివారం ఉదయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం చేరుకుని, కోదండ స్వామి ఆలయ పరిసరాలను పరిశీలించారు. 

విగ్రహ ధ్వంసం (Vandalism of idol) ఘటన గురించి అధికారులు, అర్చకుల దగ్గర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటన బాధాకరమని, దీన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు హయాంలో ఆలయాలను కూల్చినప్పుడు దేవుడు గుర్తు లేడు, కానీ ఇప్పుడు బాబుకు దేవుడు గుర్తొచ్చాడని విమర్శించారు.బాబు.. దేవాలయ ఆస్తులను తన బినామీలకు దారాదత్తం చేశారని చురకలు అంటించారు.  రామ తీర్థం ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లంపల్లి తెలిపారు. దేవుడి విగ్రహాలు ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని, ఈ ఘటన వెనక ఉన్నవారికి శిక్ష తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

అసలేం జరిగింది ? 
రామతీర్థం ప్రధానాలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో నీలాచలం కొండ మీద శ్రీ కోదండరామస్వామి ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో ఈ నెల 28 అర్ధరాత్రి కొందరు దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ద్వంసం చేశారు. సాధారణంగా రోజూ అక్కడకు పూజారి ఉదయం 8 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 12కు వెనక్కి వచ్చేస్తారు. అప్పటి నుంచి ఎవ్వరూ ఉండరు. దీన్ని అదనుగా తీసుకున్న దుండగులు ఖండించిన శిరస్సును సీతమ్మ కొలనులో పడేశారు. 29వ తేదీ ఉదయం 7.30గంటలకు ఆలయ పూజారి ఎప్పటిలానే స్వామివారికి నిత్య కైంకర్యాల కోసం వెళ్లారు. ఆలయం తలుపులు తెలిచి ఉండటం చూసి కంగారు పడి లోపలికి వెళ్లకుండానే గర్భగుడి పైపు చూడగా శ్రీరాముడి విగ్రహం మొండెం మాత్రమే కనిపించింది. వెంటనే ప్రధాన ఆలయంలోని పూజారులకు విషయం తెలియజేశారు. 

ఇదిలా ఉంటే రాత్రయితే అక్కడ ఎలాంటి నిఘా ఉండదు. అందుకే దుండగులు ఆ సమయాన్ని ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. కొండపైకి వారు వెళ్లినపుడు సెల్‌ఫోన్‌ కూడా తమ వెంట తీసుకెళ్లకుండా జాగ్ర త్త పడ్డారు. సెల్‌ఫోన్‌ తీసుకువెళ్లి ఉంటే ఆ సమయంలో ఏ నెట్‌ వర్క్‌ టవర్‌ నుంచి సిగ్నల్స్‌ వచ్చాయో కనిపెట్టడం పోలీసులకు సులభమవుతుంది. ఖండించిన శిరస్సును దేవాలయం నుంచి వెలుపలికి తెచ్చి సీతమ్మకొలనులో పడేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 

బోడికొండ ఘటనపై దర్యాప్తును సీరియస్‌గా తీసుకున్న రా ష్ట్ర ప్రభుత్వం డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్‌జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది. ఆలయానికి విద్యుత్‌ సౌకర్యం వచ్చిందని, సీసీ కెమెరాలు పెడుతున్నారని తెలుసుకుని మరీ దుండగులు ముందుగానే తమ కుట్రను అమలు చేస్తున్నారన్న అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ఆరా తీస్తున్నారు. 

 ఇదిలా ఉంటే జరిగిన సంఘటనను నాయకులుతమ రాజకీయ లబ్ధికే  వాడుకుంటూ దర్యాప్తునకు అవరోధంగా మారుతున్నారని పోలీసులే అంటున్నారు. కొండపై గల కోదండరామ స్వామి దేవాలయాన్ని జిల్లా ఎస్పీ సంఘటన జరిగిన రోజునే గాకుండా శుక్రవారం కూడా వెళ్లి, నేరం జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బోడికొండ సంఘటనపై రాజకీయ పార్టీల లబ్ధికోసం ధర్నాలు చేస్తుండటం వల్ల దర్యాప్తునకు విఘాతం కలుగుతోంది. ఇటువంటి సున్నిత అంశాలపై ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం వల్ల దర్యాప్తునకు ఇబ్బందిగా ఉంది. ధర్నాలు, నిరసనల బందోబస్తుకే విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ చర్యను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించింది. సంఘటనపై  సమగ్రమైన దర్యాప్తు ఇప్పటికే చేపట్టింది. ఛేదించేందుకు అయిదు ప్రత్యేక బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి.

ఇటీవల దేవాలయాలకు సంబంధించి వరుస సంఘటనలు జరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇకనుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద  నిరంతరం నిఘా ఉంటుందని, పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్‌కు ఆదేశించినట్లు చెప్పారు. దేవాలయాలు ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మన అందరిదని, అర్చకులు పూజారులు ఆలయ నిర్వాహకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికల సమాచారాన్ని తక్షణమే సమీపంలోని  పోలీసులకు లేదా డైల్ 100కు  సమాచారం ఇవ్వాలన్నారు. ఎల్లవేళలా పోలీసుశాఖ అందుబాటులో ఉంటుందన్నారు.  

రాష్ట్రంలోని  అన్ని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల భద్రత చర్యలను పర్యవేక్షించాలని ఎస్పీలకు స్పష్టమైన  ఆదేశాలు ఇచ్చినట్లు డీజీపీ తెలిపారు. ప్రతి ఒక్క దేవాలయాలన్ని జియో ట్యాగింగ్ చేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.

For All Tech Queries Please Click Here..!