వైసీపీ మూటా ముల్లె సర్దుకునే రోజు దగ్గర పడింది : బండి సంజయ్

Wednesday, March 3, 2021 02:00 PM Politics
వైసీపీ మూటా ముల్లె సర్దుకునే రోజు దగ్గర పడింది : బండి సంజయ్

Hyderabad, Jan 4: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Telangana BJP chief Bandi Sanjay) ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తిరుపతి పార్లమెంట్ కు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో (Tirupati Bypoll)  బైబిల్‌ పార్టీ కావాలో..? భగవద్గీత పార్టీ కావాలో..? తిరుపతి ప్రజలే తేల్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. హిందూ కానుకులను దారి మళ్లీస్తున్నారన్న బండి సంజయ్‌.. దేవాలయాలపై దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు. సోము వీర్రాజు నాయకత్వంలో పోరాటానికి సిద్ధమవ్వాలన్నారు. తిరుపతి ఉపఎన్నిక ఫలితం (Tirupati parliamentary bypolls) కోసం దేశమంతా ఎదురుచూస్తుందన్న ఆయన వైసీపీ మూట ముల్లె సర్ధుకునేలా తరిమికొట్టాలన్నారు.
 
ఏపీలో ఒక మతం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా పునరావృతమవుతాయని జోస్యం చెప్పారు. హైదరాబాదులోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. హిందూ దేవాలయాలకు వస్తున్న కానుకలు, నిధులను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇతర మతాలకు దారి మళ్లిస్తోందని దుయ్యబట్టారు. ఏపీ బీజేపీ నేతలు, కార్యకర్తల సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని అన్నారు.

 దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని.. ఇంత జరుగుతున్నా జగన్ స్పందించకపోవడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమంటూ దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం మూటాముల్లె సర్దుకునేలా తరిమికొడతామని ఆయన హెచ్చరించారు.

హిందూ ధర్మాన్ని నాశనం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఉద్యమిస్తున్నారని చెప్పారు. సింహాచలం పాలక మండలి మార్పు నుంచి, అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టడం, నిన్న రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును ఖండించడం వరకు ఎన్నో దుర్మార్గమైన పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం అత్యంత దారుణమని అన్నారు. 

తెలంగాణలో ఒక మతానికి ఇక్కడి సీఎం కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని... ఏపీలో ఒక మతమే రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తల కంటే ఏపీ బీజేపీ కార్యకర్తలు బలవంతులని, దమ్మున్నవారని బండి సంజయ్ అన్నారు. సోము వీర్రాజు దమ్మున్న నాయకుడని, ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తి అని చెప్పారు. తిరుమలకు వస్తున్న ఆదాయమంతా ఎక్కడకు పోతోందని నిలదీశారు. 
రెండు కొండలవాడా గోవిందా గోవిందా అనే వైసీపీకి ఓటు వేస్తారా? లేక ఏడు కొండలవాడా గోవిందా గోవిందా అనే బీజేపీకి ఓటువేస్తారా? అనే విషయాన్ని ఏపీలోని హిందువులందరూ ఆలోచించాలని అన్నారు.  ఏడు కొండలను రెండు కొండలు చేయాలనుకున్న పార్టీ ఇప్పుడు ఏపీలో రాజ్యాధికారాన్ని చెలాయిస్తోందని మండిపడ్డారు. ఏపీ ప్రజలు చాలా తెలివైనవారని... అధికార పార్టీకి బుద్ధి చెపుతారని అన్నారు. తిరుపతి ప్రజలు ఇచ్చే తీర్పు కుహనా లౌకికవాదుల చెంప ఛెళ్లుమనిపించేలా ఉండాలని పిలుపునిచ్చారు.

తిరుపతి ఉప ఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురు చూస్తోందని చెప్పారు. తిరుపతిలో ధర్మం గెలవబోతోందా? లేక హిందూ మత వ్యతిరేకులు గెలుస్తారా? అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడినైన తాను... ఏపీలో జరుగుతున్న దారుణాలపై బాధతోనే మాట్లాడానని చెప్పారు. రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.

For All Tech Queries Please Click Here..!