స్టాలిన్ పార్టీ డీఎంకే కండువా కప్పుకున్న రజినీకాంత్ అభిమానులు

Tuesday, March 16, 2021 12:00 PM Politics
స్టాలిన్ పార్టీ డీఎంకే కండువా కప్పుకున్న రజినీకాంత్ అభిమానులు

Chennai, Jan 18: రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేనని చెప్పడంతో అభిమానులు తలో దారి చూసుకుంటున్నారు. కొంద‌రు జిల్లాల నేత‌లు డీఎంకేలో చేరారు. ఈ నేప‌థ్యంలో ర‌జ‌నీ మ‌క్క‌ల్ మంద్ర‌మ్ టీమ్ స‌భ్యులు స్పందించారు. ఇక ఎవ‌రైనా టీమ్‌కు రాజీనామా చేసి, వేరే ఏ పార్టీలో అయినా చేర‌వ‌చ్చు అని ఒక ప్ర‌క‌ట‌న‌లో స్ప‌ష్టం చేశారు. అయితే వాళ్లు ఏ పార్టీలో చేరినా ర‌జ‌నీకాంత్ అభిమానులం (Rajinikanth Fans) అన్న విష‌యాన్ని మాత్రం మ‌ర‌చిపోవ‌ద్ద‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు. 

 ర‌జనీకాంత్ స్థాపించిన ర‌జ‌నీ మ‌క్క‌ల్ మాండ్రం జిల్లాల కార్య‌ద‌ర్శులు ముగ్గురు ఆదివారం డీఎంకే అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆ పార్టీ జెండాలు (Three district secretaries Join DMK) క‌ప్పుకున్నారు. కాగాఈ ఏడాది ఏప్రిల్‌-మే నెల‌ల్లో త‌మిళ‌నాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక‌లు (Tamil Nadu Polls) జ‌రుగ‌నున్నాయి. డీఎంకే కార్యాల‌యం అన్నా అరివాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ర‌జ‌నీ మక్క‌ల్ మాండ్రంకు చెందిన ముగ్గురు జిల్లా కార్య‌ద‌ర్శుల‌తోపాటు మ‌రో ముగ్గురు నేత‌లు త‌మ పార్టీలో చేరార‌ని డీఎంకే ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ కార్య‌క్ర‌మంలో డీఎంకే డిప్యూటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఏ రాజా, ఆర్గ‌నైజింగ్ కార్య‌ద‌ర్శి ఆర్ ఎస్ భార‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తొలుత త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ర‌జ‌నీకాంత్ (Rajinikanth) త‌ర్వాత త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. దేవుడు శాసించాడు.. త‌లైవా పాటిస్తాడంటూ త‌న‌కు స‌రిప‌డ‌వంటూ రాజ‌కీయాల్లోకి రాబోన‌ని గ‌తేడాది 29వ తేదీన తేల్చేశారు. దీంతో ఆయ‌న అభిమానులంతా నిరుత్సాహానికి గుర‌య్యారు. ఈ క్ర‌మంలో ర‌జ‌నీ మ‌క్క‌ల్ మాండ్రం తూత్తుకూడి, రామ‌నాథ‌పురం జిల్లాల కార్య‌ద‌ర్శులు ఏ జోసెఫ్ స్టాలిన్‌, కే సెంథిల్ సెల్వానంద్‌, థేనీ జిల్లా కార్య‌ద‌ర్శి ఆర్ గ‌ణేశ‌న్.. ప్ర‌తిప‌క్ష డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. 

ఇదిలా ఉంటే ఆయన్ను రాజకీయాల్లోకి రప్పించేందుకు కొందరు పోరాటాల బాట పట్టినా తాను మాత్రం రానంటే రాను అని రజనీ స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో రజనీతో రాజకీయపయనం సాగించాలన్న ఆశతో ఉన్న ఆయన అభిమాన సంఘం నేతలు , తలైవా నిర్ణయంతో ఇక తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే తూత్తుకుడి జిల్లా రజనీ మక్కల్‌ మండ్రం కార్యదర్శి జోషఫ్‌ స్టాలిన్, రామనాథపురం కార్యదర్శి సెంథిల్‌ సెల్వానంద్, తేని కార్యదర్శి గణేషన్‌ తమ మద్దతుదారులతో కలిసి స్టాలిన్‌ సమక్షంలో డీఎంకేలో చేరారు. త్వరలో మరి కొంత మంది రజనీ మక్కల్‌ మండ్రం నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. తమ లక్ష్యం డీఎంకేను అధికారంలోకి తీసుకురావడమేనని పేర్కొన్నారు. 

ఈ సంధర్భంగా స్టాలిన్‌ (MK Stalin) ప్రసంగిస్తూ రానున్న ఎన్నికల్లో 200 కాదు, 234 నియోజకవర్గాల్ని డీఎంకే కూటమి కైవసం చేసుకోవడం ఖాయం అన్నట్టు ధీమా వ్యక్తం చేశారు.  తాము అధికారంలోకి రాగానే రుణమాఫీతో పాటు వృద్ధాప్య పింఛన్‌ సక్రమంగా అందే రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు.  

ఇదిలా ఉంటే ఉదయాన్నే ట్రాక్‌ షూట్, హెల్మెట్‌ ధరించి స్టాలిన్‌ స్పోర్ట్స్‌ సైకిల్‌ తొక్కుతూ దూసుకెళ్తున్న వీడియో ఒకటి ఆదివారం వైరల్‌గా మారింది. ఆరోగ్య సంరక్షణలో  ముందుండే స్టాలిన్‌ ఈ వీడియోలో ఎలాంటి భద్రత లేకుండా, కేవలం సైక్లింగ్‌ చేసే వారితో కలిసి స్టాలిన్‌ ముందుకు సాగడం, రోడ్డుపై వెళ్తున్న వారికి అభివాదం తెలియజేయడం గమనార్హం.
 
 ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రాక‌పోయినా.. త‌మిళ‌నాడులో త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తార‌ని బీజేపీ ఆశ‌తో ఉంది. ఆయ‌న మ‌ద్ద‌తు కోసం క‌చ్చితంగా ప్ర‌య‌త్నిస్తామ‌ని ఆ పార్టీ త‌మిళ‌నాడు ఇన్‌ఛార్జ్ సీటీ ర‌వి గ‌తంలోనే చెప్పారు. కానీ తాజాగా ఆయ‌న టీమ్ చేసిన ప్ర‌క‌ట‌న బీజేపీకి మింగుడు ప‌డ‌టం లేదనే వార్తలు వస్తున్నాయి. 


 

For All Tech Queries Please Click Here..!