పొత్తులపైనా పవన్ కళ్యాణ్ మాటల్లో నిజమెంత?

Wednesday, July 31, 2019 12:00 PM Politics
పొత్తులపైనా పవన్ కళ్యాణ్  మాటల్లో నిజమెంత?

గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని వైసిపి నేతలు ప్రయత్నించారని, కానీ తాను తిరస్కరించినట్లు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపితో పాటు జనసేనతో పొత్తుకు టీడీపీ కూడా ప్రయత్నించిందట, రెండు పార్టీలను తాను తిరస్కరించినట్లు పవన్ అన్నారు. ఇందులో నిజమెంత అన్న విషయాన్ని పక్కన పెడితే, ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్ అయ్యాయి. వైసిపి విషయానికి వస్తే పవన్ మాటలను నమ్మటం కష్టమే. ఎందుకంటే జనసేనను ఒక పార్టీగా, పవన్ను ఒక రాజకీయ నేతగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ గుర్తించలేదు. పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ వైఖరి గమనించిన తర్వాత ఇక పొత్తుల విషయాన్ని పవన్ తో ఎవరు ప్రస్తావిస్తారు? జగన్ కు తెలీకుండా వైసిపిలో పొత్తుల చర్చలు ఎవరూ చేయరు. జగన్-పవన్ మధ్య పొత్తుకోసం ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ తప్పుడు వార్తలుగా ప్రశాంత్ కొట్టేశారు.

ఉభయగోదావరి జిల్లాల్లోని కాపుల ఓట్లను దృష్టిలో పెట్టుకుని కొందరు వైసిపి ప్రముఖ నేతలు పవన్ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని జగన్ కి సూచిస్తే, జగన్ పొత్తులు అవసరం లేదని చెప్పిన మాట వాస్తవం. ఇక టిడిపి విషయానికి వస్తే పవన్ తో పొత్తు కోసం స్వయంగా చంద్రబాబునాయుడే ప్రయత్నించిన మాట వాస్తవం. ఆ విషయాన్ని చంద్రబాబే స్వయంగా సమావేశాల్లో చెప్పుకున్నారు. 'పవన్ ఎప్పటికైనా మనోడే కాబట్టి ఎక్కువగా పవన్ గురించి మాట్లాడకండి' అని చంద్రబాబు చెప్పిన మాట అందరికీ తెలిసిన విషయమే. చంద్రబాబు పొత్తుకు ప్రయత్నించినా పవన్ వద్దు అనడానికి బలమైన కారణం ఉంది, అప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై జనాలో పెరిగిపోయిన ఆగ్రహం పవన్ కు అర్ధమైఉంటుంది. అందుకే చంద్రబాబుతో పొత్తు వద్దనుకున్నారు.

For All Tech Queries Please Click Here..!
Topics: