కొడాలి నాని సవాల్,,దేవినేని ఉమ అరెస్ట్, వల్లభనేని వంశీ కౌంటర్

Wednesday, March 17, 2021 12:00 PM Politics
కొడాలి నాని సవాల్,,దేవినేని ఉమ అరెస్ట్, వల్లభనేని వంశీ కౌంటర్

Amaravati, Jan 19: విజయవాడలోని గొల్లపూడిలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నాని సవాల్‌కు ప్రతి సవాల్‌గా మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసన దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  దీక్షకు యత్నించిన మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి (Devineni Uma Arrested) తీసుకున్నారు. దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు  అడ్డుకున్నారు. 

ఎన్టీఆర్‌ విగ్రహం సమీపంలో వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా నినాదాలు (High Tension In Gollapudi) చేశారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఈ హడావుడిలోనే ఎన్టీఆర్‌ విగ్రహం వద్దకు మాజీ మంత్రి దేవినేని ఉమ చేరుకున్నారు. మంత్రి కొడాలి నాని సవాల్‌కు సిద్ధమని ప్రకటించారు. దేవినేని ఉమను పోలీసులు అరెస్టు చేసి  తీసుకెళ్లారు. జగన్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు..దేవినేని ఉమ‌ డౌన్ డౌన్ అంటూ ‌వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఉమాను తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో గొల్లపూడిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

గొల్లపూడిలో సోమవారం 3648 ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా.. దేవినేని ఉమకు వైఎస్సార్‌ సీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ బహిరంగ చర్చకు రావాల్సిందిగా సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే.  అయితే బహిరంగ చర్చకు హాజరు కాకుండా ఉండేందుకు తన దీక్ష గురించి ముందే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నారనే కారణంతో పోలీసులు దేవినేనిని అరెస్ట్‌ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. చర్చకు హాజరుకాకుండా ఉండేందుకు పక్కా ప్లాన్‌తోనే దేవినేని నిరసన దీక్ష ప్రారంభించి.. అరెస్ట్‌ అయ్యేలా వ్యూహం పని చర్చ జరగకుండా తప్పించుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

ఇక ఎన్టీ రామరావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, వదినను చంపిన ఉమా రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. ప్లేస్, టైమ్, డేట్ ఉమా ఫిక్స్ చేయాలని సవాల్‌ విసిరారు. ఎన్నికల ముందు పసుపు.. కుంకుమ ఇస్తే ప్రజలు టీడీపీకి కోసి కారం పెట్టారని తెలిపారు. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని.. సవాల్ అయినా ప్రతి సవాల్ అయినా మేము సిద్ధమేనని వంశీ ప్రకటించారు.

మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షపై కౌంటర్‌ బదులిచ్చారు. అసంబద్ధమైన ఆరోపణలు చేసి చర్చకు రా అంటే ఎలా అని వంశీ ప్రశ్నించారు. అభివృద్ధిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. చంద్రబాబు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. చర్చ పెట్టుకుందాం అని చెప్పాము కానీ కొట్లాటకు రమ్మని మేము చెప్పలేదని వంశీ వివరించారు. ఉమా తక్కువ తినలేదు తక్కువ మాట్లాడతాడని మేము అనుకోమని పేర్కొన్నారు. ఒకటి అని రెండు అనిపించుకోవడం ఉమాకి అలవాటు అని తెలిపారు. టీడీపీ చాలా గొప్ప పార్టీ.. ఎన్టీఆర్ టీడీపీ వేరు.. చంద్రబాబు టీడీపీ వేరు అని చెప్పారు.

గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగిందో నాకు తెలుసని.. ఉమా ఒక లోఫర్ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మా ఇంట్లో అనేక కులాలు ఉన్నాయి.. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే మేము గెలిచామని పేర్కొన్నారు. ఒక కులాన్ని టార్గెట్ గా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించడం అవాస్తవమని స్పష్టం చేశారు. ఒక కులం వాళ్లు ఓట్లు వేస్తే నేను నాని ఎమ్మెల్యేలుగా గెలవలేదని తెలిపారు. ఉమా ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలని వల్లభనేని వంశీ హితవు పలికారు.

For All Tech Queries Please Click Here..!