GHMC Election Results 2020: కారుకు దిమ్మతిరిగే షాకిచ్చిన బీజేపీ 

Sunday, January 17, 2021 02:00 PM Politics
GHMC Election Results 2020: కారుకు దిమ్మతిరిగే షాకిచ్చిన బీజేపీ 

Hyderaabd, Dec 4: ఎట్టకేలకు గ్రేటర్ ఫలితాల ఉత్కంఠకు తెర పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు (GHMC Election Results 2020) వెలువడ్డాయి. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ (TRS) 56 డివిజన్లలో గెలుపొందింది. తెలంగాణ (Telangana) ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి వరుస ప్రభంజనాలు సృష్టించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ సారి అంచనాలను పూర్తిగా తారుమారు చేసింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో (GHMC Elections) 150 డివిజన్లకు గాను 99 డివిజన్లను దక్కించుకున్న టీఆర్‌ఎస్‌.. రాష్ట్ర రాజకీయాల్లో పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నించినా 56 స్థానాలతో సరిపెట్టుకుంది. 

పాతబస్తీలో ఎదురులేని ఎంఐఎం (AIMIM).. గత ఎన్నికల్లో గెలిచిన 44 స్థానాలతో పాటు మరో స్థానాన్ని గెలుచుకుని 43 సీట్లతో నిలిచింది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 68 డివిజన్లకు గాను కేవలం 4 స్థానాల్లో గెలిచిన బీజేపీ (BJP) ఈసారి అనూహ్యంగా రెండో స్థానం దక్కించుకుంది. 49 డివిజన్లలో విజయం సాధించి  టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ (Congress) మునుపెన్నడూ లేని స్థాయిలో భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఆ పార్టీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీకి ఓటర్లు పెద్ద షాకివ్వడంతో.. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు చోట్లే విజయం సాధించింది. ఉప్పల్, ఏఎస్‌రావునగర్‌లో ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్ పరాజయం పాలైంది.

జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలిచిన తెలంగాణ ప్రజలకు కేంద్ర  హోంమంత్రి అమిత్ షా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగులో ట్వీట్ చేసిన ఆయన.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలో,అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.  కార్యకర్తలను ప్రత్యేకంగా అభినందించారు.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఫలితాలు ఆశించిన విధంగా రాలేదని అయినా ఇందులో నిరాశ పడాల్సిందేమీ లేదని చెప్పుకొచ్చారు. 25-30 డివిజన్లు ఇంకా అదనంగా వస్తాయని ఆశించామన్నారు. కానీ 10-20 డివిజన్లలో మాత్రం 200-300 ఓట్ల తేడాతో ఓడిపోయామని పేర్కొన్నారు. ఇక కొన్నిస్థానాల్లో అయితే చాలా తక్కువ ఓట్లతో ఓటమి చెందినట్లు చెప్పారు. అయినా కూడా గ్రేటర్‌లో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్‌ను ప్రజలు ఆదరించారని వెల్లడించారు. టీఆర్ఎస్‌కు ఓటు వేసిన ప్రజలకు, అలాగే టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, నేతలకు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లతో రెండో అతిపెద్ద పార్టీగా నిలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, గ్రేటర్‌లో తమ పార్టీ బలం పుంజుకుందన్నారు. ప్రజల నమ్మకాన్ని ఎంఐఎం, టీఆర్‌ఎస్‌ కోల్పోయాయని తెలిపారు. ముందస్తు ఎన్నికలతో తమకు సమయం సరిపోలేదని, లేకపోతే మేయర్‌ పీఠాన్ని దక్కించుకునేవాళ్లమన్నారు. గ్రేటర్‌ ఫలితాలపై తమకు సంతృప్తినిచ్చాయన్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  కమలం జెండా రెపరెపలాండిది. కారు జోరుకు బీజేపీ బ్రేకులు వేసింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ..  కార్యకర్తల వీరోచిత పోరాట ఫలితమే ఈ విజయానికి కారణమని వ్యాఖ్యానించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఈ విజయాన్ని ఎన్నికల కమిషనర్‌, డీజీపీలకు అంకితం ఇస్తున్నానని అనడం గమనార్హం. పోలీసులు, ఎంఐఎం కార్యకర్తలు ఎన్ని దాడులు చేసిన ప్రజలు బీజేపీ పక్షంగా ఉండి అభ్యర్థులను గెలిపించారని చెప్పారు. ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు.


 

For All Tech Queries Please Click Here..!