సీబీఐ కోర్టు తీర్పు, హైకోర్టులో అప్పీల్ చేయనున్న సీఎం జగన్

Friday, November 1, 2019 02:00 PM Politics
సీబీఐ కోర్టు తీర్పు, హైకోర్టులో అప్పీల్ చేయనున్న సీఎం జగన్

ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురయ్యింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు డిస్మిస్ చేసింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా తాను హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపి ఈ మేరకు తీర్పు వెలువరించింది. ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావడం ఇబ్బందని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సీబీఐ కూడా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ జగన్ పిటిషన్‌పై గట్టిగా వాదనలు వినిపించింది. ఈ కేసులో పరిస్థితులు మారాయి. నేరంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. జగన్ ఎంపీగా ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయాలని ప్రయత్నించారని.. జగన్ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్నారని.. మినహాయింపు ఇస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని చెప్పింది. సీబీఐ వాదనతో ఏకీభవించిన సీబీఐ కోర్టు పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

ఇప్పుడు సీబీఐ కోర్టు నిర్ణయం పైన హైకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. జగన్ దాఖలు చేసిన పిటీషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వెంటనే జగన్ న్యాయవాదులు ఈ తీర్పు పైన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించటం ద్వారా అక్కడ నుండి అనుమతి పొందేందేకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

కోర్టులో వాదనలు వాడీవేడీగా జరిగాయి. సీబీఐ తరపున న్యాయవాది తన వాదనను బలంగా వినిపించారు. గతంలో కూడా జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని సీబీఐ పేర్కొంది. తర్వాత జగన్ హైకోర్టును ఆశ్రయించారని అక్కడ కూడా ఈ పిటిషన్‌ని న్యాయస్థానం డిస్మిస్ చేసిందన్నారు. ఇప్పుడు ఆయన సీఎం అయ్యారన్న ఏకైక కారణంతో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడానికి చేసిన ప్రయత్నాన్ని, ఈ కేసులో ఉన్న ఇతర అధికారులు కూడా ఏపీలో ఆశ్రయం పొందడానికి చేసిన యత్నాలను కూడా సీబీఐ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ఈ నేపథ్యంలోనే సీబీఐ వాదనలను న్యాయస్థానం సమర్ధించింది. జగన్‌కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వడంవల్ల అతని కేసులు, సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ వాదనలు వినిపించింది. జగన్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, అందుకే అప్పుడు ఆయనను అరెస్టు చేయడం జరిగిందని, అలాంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారని, అధికారులంతా ఆయన చెప్పినట్లు వినాల్సి ఉంటుందని.. ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని సీబీఐ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.

 తాము రాష్ట్ర ప్రయోజనాల కోసమే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నామని జగన్ తరపున న్యాయవాదులు వినిపించారు. జగన్ హాజరుకాకపోతే కేసు విచారణలో జాప్యం ఎలా జరుగుతుందో సీబీఐ చెప్పాలని వాదనలు వినిపించారు. గతంలో ఎప్పుడూ కేసుల వాయిదా కోరలేదని స్టే కూడా అడగలేదని గుర్తు చేశారు. అలాగే సాక్ష్యులలను ప్రభావితం చేసినట్లు ఆరేళ్లలో ఒక్క ఆరోపణ కూడా లేదని కోర్టుకు విన్నవించారు. అయితే కోర్టు ఈ వాదనలతో ఏకీభవించలేదు. 

ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ సీబీఐ కోర్టు తీర్పును స్వాగతించింది. జగన్ కోర్టుకు హాజరయ్యేందుకు ప్రభుత్వ నిధులు వినియోగించటానికి వీళ్లేదనే వాదన మొదలు పెట్టింది. అలాగే 11 ఛార్జ్ షీట్లలో ఉన్న జగన్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన కోర్టు మినహాయింపు ఇవ్వదని టీడీపీ నేత యనమల వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారనే కారణంతో ప్రజా ధనంతో కోర్టుకు వెళ్లే హక్కు జగన్ కు లేదన్నారు. ఆయన మీద నమోదైన కేసులు వ్యక్తిగతమైనవని వ్యక్తిగత ఖర్చుతోనే హాజరవ్వాలని డిమాండ్ చేసారు. కోర్టు ముందు అందరూ సమానులే అనే విషయం మరోసారి తేలిందన్నారు. అసలు 11 ఛార్జ్ షీట్లలో ఉన్న వ్యక్తి ఇటువంటి మినహాయింపు ఎలా కోరుతారని ప్రశ్నిస్తున్నారు. 

ఇక, హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ పైన అక్కడ నిర్ణయం ఆధారంగా జగన్ సుప్రీం కు వెళ్లాలా లేదా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.  


 

For All Tech Queries Please Click Here..!