జగన్ సలహాలు అమలు చేస్తున్న కేంద్రం..

Friday, May 1, 2020 02:03 PM Politics
జగన్ సలహాలు అమలు చేస్తున్న కేంద్రం..

జగన్ ఏ విషయమైనా చాలా అడ్వాన్స్డ్ గా గ్రహిస్తారు. అంతే కాదు ఆ విషయాన్ని అందరికంటే ముందే చెప్తారు. జగన్ వ్యతిరేకులు అంతా దానిని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. జగన్ ది అనుభవరాహిత్యమంటూ ప్రచారం చేస్తారు. కానీ చిట్టచివరికి అంతా జగన్ దారిలోకే వస్తారు. జగన్ అప్పుడే చెప్పారని నాలుక కరుచుకుంటారు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సలహాలు ఈరోజు యావత్ భారత దేశానికి ఆచరణీయమవుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నే వాటిని అమలులోకి తీసుకొస్తున్నారు.

కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంతకీ జగన్ ఇచ్చిన సలహా ఏంటనే కదా..? మీ అనుమానం. అక్కడికే వస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రెండు వారాల కిందట వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 14 లాక్ డౌన్ పొడిగింపునకు ముందు ఈ వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అప్పుడు మొత్తం దేశంలోని ముఖ్యమంత్రులంతా చాలా ఆందోళనగా ఇతర సమస్యలన్నింటినీ పక్కన పెట్టి లాక్ డౌన్ ని పొడిగించాల్సిందేనని సూచించారు. 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండో ఆలోచనలేవీ చేయకుండా అదే మాట చెప్పారు. 

అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి చేసిన సూచనలు సంచలనంగా మారాయి. జగన్ అంటే గిట్టని వారు అయితే దానిని తీవ్ర వ్యతిరేకంగా ప్రచారం చేశారు. జగన్ స్వయంగా ప్రధానమంత్రితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో క్రమంగా లాక్ డౌన్ నిబంధనలను సడలించుకుంటూ వెళ్లాలని సూచించారు. కేసులు ఉన్న రెడ్, ఆరెంజ్ జోన్లలో లాక్ డౌన్ ని కఠినంగా అమలు చేసి గ్రీన్ జోన్లలో సడలింపులు ఇవ్వాలని సూచించారు. అప్పటికి ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమే మండలాల వారీగా గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్ల జాబితాను సిద్ధం చేశారు. కేంద్రం లాక్ డౌన్ పై ఏ నిర్ణయం తీసుకున్నా, దేశంతో కేంద్రంతో కలిసి వస్తామని జగన్ మోదీకి మద్దతిచ్చారు. 

అదే సందర్భంలో గ్రీన్ జోన్లలో వ్యవసాయ రంగం, ఆక్వారంగం, ఉద్యానవన పంటలు, ఉపాధి హామీ పనులకు వెసులు బాటు ఇవ్వాలని సూచించారు. అలానే పారిశ్రామిక రంగంలో కూడా ఉత్పత్తిని ప్రారంభించాలని, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ జీవనాన్ని ప్రారంభించాలని సలహా ఇచ్చారు. 

వలస కూలీల విషయంలో కూడా ఎవరి రాష్ట్రాలకు వారిని పంపాలని సూచించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్ లో ఉంచి, మెడికల్ ప్రోటోకాల్ పాటిస్తే సరిపోతుందని చెప్పారు. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోకుండా అప్రమత్తంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 

అప్పుడు జగన్ వ్యాఖ్యలను ఏపీలో మీడియా, ప్రతిపక్షాలు తీవ్ర దుమారం చేశాయి. జాతీయ మీడియా కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం లాక్ డౌన్ కు విరుద్ధమంటూ ప్రచారం చేశాయి. కానీ ఈనెల 20వ తేదీ తరువాత నుంచి కేంద్ర హోంశాఖ ఒక్కొక్కటిగా సీఎం జగన్ ఆరోజు ఏ అంశాలనైతే ప్రస్తావించారో వాటన్నింటినీ అమలు చేస్తూ వస్తోంది. పరిశ్రమలకు, వ్యవసయ, అనుబంధ రంగాలకు, గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు, ఉపాధి పనులకు ఈనెల 23న సడలింపు ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మొత్తం గ్రీన్ జోన్లలో దాదాపు 80 శాతం వరకు సడలింపులు ఇచ్చింది.
 
సినిమా హాళ్లు, స్కూళ్లు, మాల్స్ మినహా అన్నింటినీ తెరిచేయాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు ఆదేశించింది. ఇప్పుడు అంతా జగన్ చెప్పిందే కదా..? కేంద్రం ఇప్పుడు చెప్పింది..? ఇన్నాళ్లూ జగన్ ని తప్పుపట్టారని చర్చించుకుంటున్నారు. ఇలా జగన్ క్రేజ్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

కరోనా నియంత్రణ లో పరీక్షల సామర్థ్యాన్ని పెంచి దేశంలోనే ఏపీని నెంబర్ వన్ చేశారు. సీనియర్ సీఎంలకు కూడా సాధ్యం కానిది చేసి చూపించారు. పేదలకు బియ్యం, సంక్షేమ పథకాల అమలులోనూ తిరుగులేదని నిరూపించారు. ఇప్పుడు కేంద్ర హోంశాఖే జగన్ చెప్పిన జోన్ల వారీ సడలింపులను అమలు చేయడంతో జగన్ టీమ్ ఫుల్ జోష్ లో ఉంది...

For All Tech Queries Please Click Here..!
Topics: