చంద్రబాబు అక్రమాస్తుల కేసు 18కి వాయిదా, పట్టువదలని లక్ష్మీపార్వతి 

Friday, March 5, 2021 04:15 PM Politics
చంద్రబాబు అక్రమాస్తుల కేసు 18కి వాయిదా, పట్టువదలని లక్ష్మీపార్వతి 

Hyderabad, Jan 5: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్రమాస్తులు కూడబెట్టారని..దీనిపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. అయితే ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సవాల్‌ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అయితే ఈ పిటిషన్‌లో సోమవారం తీర్పు ఇవ్వాల్సి ఉన్నా.. న్యాయమూర్తి మరోసారి వాయిదా వేశారు.

ఆరు నెలలకు మించి స్టే ఉత్తర్వులు కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించిన నేపథ్యంలో... ఈ ఏడాది మొదట్లో ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేసేలా ఏసీబీని ఆదేశించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది ఏసీబీ కోర్టుకు నివేదించారు.  దీంతో ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. 

ఈ పిటిషన్‌పై ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నా... పలుమార్లు వాయిదాపడుతూ వస్తోంది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అవినీతిపై దాఖలైన పిటిషన్లను రోజువారీ పద్ధతిలో విచారించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై వెంటనే తీర్పును వెలువరించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది పలుమార్లు ఏసీబీ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే సుప్రీం తీర్పు ఈ పిటిషన్‌కు వర్తించదని, కేసులు నమోదై న్యాయ స్థానాల్లో విచారణ పెండింగ్‌లో ఉన్న వాటికే ఆ తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసిన న్యాయమూర్తి... ఈ పిటిషన్‌పై తీర్పును 18కి వాయిదా వేశారు.

కేసు నేపథ్యం ఇది.. 
అప్పట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అక్రమాస్తులు కూడబెట్టారని, వాటిపై విచారణ జరిపించాలనీ లక్ష్మీపార్వతి ఆరోపిస్తూ.. ఈ విషయంలో ఏసీబీ విచారణ జరిపించాలని కోరుతూ ఏసీబీ స్పెషల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేగా రూ.300 మాత్రమే తీసుకున్న ఆయన.. వేలకోట్ల రూపాయలు ఎలా సంపాదించారో తేలాల్సి ఉందని అన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి.. ఆయన అక్రమాస్తులపై సమగ్ర దర్యాప్తు చేయాలని లక్ష్మీ పార్వతి కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 1978 నుంచి 2005 వరకు చంద్రబాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు.

అయితే, చంద్రబాబు దీనిపై ఇంప్లీడ్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దాంతో హైకోర్టు కు వెళ్లిన చంద్రబాబు నాయుడుకు అక్కడ ఊరట లభించింది. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపి ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే విధించారు.

ఈ స్టే ఎత్తివేయాలని లక్ష్మీపార్వతి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పటి నుంచీ ఈ కేసులో స్టే కొనసాగుతోంది. కాగా, గత సంవత్సరం సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో.. ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే కొనసాగుతుందని వాదించారు. 

కానీ లక్ష్మీపార్వతి తరపు లాయర్ సివిల్, క్రిమినల్‌ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఊటంకిస్తూ వాదించారు. అదీ కాకుండా ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు కూడా లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో, 2005లో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించిన న్యాయమూర్తి, 2005లో హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, సుప్రీంకోర్టు తీర్పుతో 2005లో విధించిన స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి క్లారిటీ లేదని చెబుతూ విచారణకు ఆదేశాలు జారీచేశారు. తాజాగా ఈ కేసులో తీర్పును ఈ నెల 18కి కోర్టు వాయిదా వేసింది. 

For All Tech Queries Please Click Here..!