జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం

Sunday, February 9, 2020 03:00 PM Politics
జగన్ సర్కారు మరో సంచలన నిర్ణయం

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి మున్సిపాలిటీలో 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రూరల్‌ మండలంలోని పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం​, మల్లెంపూడి, చిర్రావురు, వడ్డేశ్వరం, గుండిమెడ, ప్రాతురు గ్రామాలు తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం అయ్యాయి. ఈ మేరకు ఎనిమిది గ్రామ పంచాయతీలను పంచాయతీరాజ్‌ శాఖ డీనోటిఫై చేసింది. 

అమరావతి నుంచి మరో చోటుకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించరాదని సీఆర్‌డీఏ చట్టంలో ఎక్కడ ఉందో చూపాలని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. కార్యాలయాల తరలింపు వెనుక దురుద్దేశాలున్నాయని చెబితే సరిపోదని, ఎవరికి ఆ దురుద్దేశాలున్నాయో స్పష్టంగా చెప్పాలంది. అర్థం పర్థం లేని వాదనలతో కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు తేల్చి చెప్పింది. నిరాధార ఆరోపణలతో కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేసి, తమ ముందు నిల్చుంటే సరిపోదని, తరలింపు విషయంలో ప్రభుత్వానికి చట్టాలు ఎక్కడ అడ్డుపడుతున్నాయో కూడా చెప్పాలని స్పష్టం చేసింది.

పరిపాలనాపరమైన సౌలభ్యం కోసమే విజిలెన్స్‌ కమిషనర్, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తున్నారని చెబుతున్న నేపథ్యంలో, ఆ సౌలభ్యం ఏమిటో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ రెండు కార్యాలయాల తరలింపు జీవోలో కేవలం పాలనాపరమైన కారణాలు అని మాత్రమే పేర్కొన్నారని, ఈ నేపథ్యంలో తరలింపు కారణాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోవాలని అనుకుంటున్నామని ధర్మాసనం పేర్కొంది. అన్ని వివరాలతో మూడు రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని, సంబంధిత నోట్‌ ఫైళ్లు, ప్రొసీడింగ్స్‌ను కూడా జత చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

For All Tech Queries Please Click Here..!