మూడు వ్యవసాయ చట్టాల్లో ఏముంది..రైతుల అభ్యంతరాలు ఏమిటి ?

Friday, January 22, 2021 04:45 PM Offbeat
మూడు వ్యవసాయ చట్టాల్లో ఏముంది..రైతుల అభ్యంతరాలు ఏమిటి ?

New Delhi, Dec 8: 2015లో సుప్రీం కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన అఫిడవిట్‌ ద్వారా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు సూచించిన విధంగా రైతులకు వారి ఉత్పత్తి విలువకు 50శాతం జోడించి, కనీస మద్దతు ధరగా చెల్లించడం వీలు కాదని కేంద్ర ప్రభుత్వం ఢంకాపథంగా చెప్పిన విషయం ఎంతమందికి తెలుసు..అంటే, స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన కీలకమైన సిఫారసును కేంద్ర ప్రభుత్వం 2015లోనే తిరస్కరించింది. ఇప్పుడు ఈ మూడు చట్టాల ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని అంటోంది.

ధరల నియంత్రణకు ఈ మూడు చట్టాల్లో ఏదైనా యంత్రాంగం ఉందా.. కనిస మద్ధతు ధరను పెట్టేందుకు కేంద్రం ఎందుకు ఒప్పుకోవడం లేదు..

#మూడు_చట్టాలను ఓ సారి పరిశీలిస్తే..

1. నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) బిల్ 2020).

2) 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు' (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్)

3) 'రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020(ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ - 2020)

#మూడవది

ఏ పంటలకైనా.. రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించి కొనుగోలుదారుతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. దీనికి కాల పరిమితి కనీసం ఒక పంట కాలం నుంచి గరిష్టంగా ఐదేళ్ల వరకు ఉంటుంది. రైతులు పంట వేయడానికి ముందే కొనుగోలుదారులతో ఒప్పందం చేసుకోవచ్చు. వివాదాల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ ఉంటుంది.

#ప్రభుత్వం_చెబుతున్న_విషయం

పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు రైతులతో ఒప్పందాలు చేసుకోవడం ద్వారా తమ పంట ఉత్పత్తుల అమ్మకాల విషయంలో రైతులకు భరోసా కలుగుతుంది. ముందే ధర తెలుసుకోవడం వల్ల రైతు తన పెట్టుబడిని నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభిస్తాయి. అమ్మకాల ప్రక్రియలో ఇబ్బందులు తొలిగిపోతాయి.

#రైతుల_అభ్యంతరాలు

1.ఈ చట్టం ద్వారా ఒప్పంద సేద్యం బలపడే ప్రమాదం. 2.కార్పొరేట్ కంపెనీలు ప్రపంచవ్యాప్త డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తీసుకొస్తాయి. తద్వారా దేశంలో పంటల వైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.ఇప్పటికే పత్తి, సోయా లాంటి పంటలు కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్లిపోయాయి.

3.రసాయనాలు, యంత్రాలు, శుద్ధి, కమొడిటీ ట్రేడింగ్, సూపర్ మార్కెట్ల నిర్వహణను బడా సంస్థలే నిర్వహిస్తున్నాయి. వీటిని జవాబుదారీ చేయడం కష్టం.

4. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో బహుళజాతి సంస్థలే లాభపడ్డాయి. ఆయా ప్రాంతాల్లో, దేశాల్లో డిమాండ్‌లో హెచ్చుతగ్గులను ఆసరాగా చేసుకొని బడా కంపెనీలు ఉత్పత్తులను పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి.

#రెండవది

#ప్రభుత్వం_వాదన

వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూనే నిత్యావసరాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరిస్తాం.వ్యవసాయ రంగంలో పోటీ ఏర్పడుతుంది. తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి సదుపాయాలు పెరుగుతాయి. తద్వారా పంట వ్యర్థాలు పెద్ద మొత్తంలో తగ్గుతాయి.

వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది.

మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వేయడానికి, ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు.

నిర్దేశిత వాణిజ్య ప్రాంతంలో రాష్ట్రాల వ్యవసాయ మార్కెట్ కమిటీల నియంత్రణలోకి వచ్చే ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ వర్తకానికి(ఈ-వర్తకం) ఇది అనుమతిస్తుంది.

ఆన్‌లైన్ క్రయవిక్రయాల కోసం ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికను ఏర్పాటు చేయొచ్చు. పాన్ కార్డు ఉన్న కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, రిజిస్టర్డ్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, వ్యవసాయ సహకార సంస్థలు ఏవైనా ఇలాంటి ఆన్‌లైన్ వర్తక వేదికను ఏర్పాటు చేయొచ్చు.

#రైతుల_అభ్యంతరాలు:

దళారులు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించే ప్రమాదం. ఇటీవల ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన సందర్భంలో ఇదే జరిగిందని, తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు.

దేశంలో ఎక్కడి వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఈ చట్టం అవకాశం ఇస్తున్నా ఎంత మంది రైతులు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించగలరనేది ఇప్పుడు ప్రశ్న.. కేవలం కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు.. వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తరువాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయనేది మెజార్టీ వాదుల వాదన.

ఇంతవరకు వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ రాష్ట్రాల పరిధిలో ఉండేది. వరదలు, తుపాన్లు వచ్చినప్పుడు.. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు దిగుబడులు తగ్గి సొంత అవసరాలకే పంట ఉత్పత్తులు చాలని పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ఉత్పత్తులు తమ సరిహద్దులు దాటకుండా నియంత్రణ విధించే వెసులుబాటు ఉండేది. కొత్త చట్టాలలో ఆ అవకాశం లేదు. దేశమంతటా ఎక్కడైనా అమ్ముకోవచ్చు. అలాంటప్పుడు రాష్ట్రాలు తమ సొంత ప్రయోజనాలు కాపాడుకోలేని స్థితికి చేరుకుంటాయనేది రైతు సంఘాల వాదన.

#మొదటిది

నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు

దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యవసర సరకుల చట్టం - 1955కి ఇది కొన్ని సవరణలతో వస్తుంది.

నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణాధికారం కేంద్రానికి దఖలు పరుస్తుందీ చట్టం.వ్యవసాయరంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచడానికి ఉద్దేశించిన చట్టంగా ఆర్డినెన్సులో పేర్కొన్నారు.

వినియోగదారుల ప్రయోజనాలు రక్షిస్తూనే నిత్యవసరాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరించడం దీని ఉద్దేశమని ఆర్డినెన్సులో ఉంది.

ఆహార ఉత్పత్తులపై నియంత్రణ: కొన్ని రకాల ఆహార పదార్థాలు, ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటివి నిత్యవసరాలుగా పేర్కొనడానికి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇస్తుంది. అలాంటి నిత్యవసరాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాన్ని నియంత్రించడానికి, నిషేధించడానికి కేంద్రానికి అధికారం ఉంటుంది.

యుద్ధం, దుర్భిక్షం, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, ఉల్లి, నూనెగింజలు, నూనెలు వంటి ఆహారవస్తువులలో వేటి సరఫరానైనా నియంత్రించే అధికారాన్ని కేంద్రానికి ఇస్తుందీ చట్టం.

ఏదైనా నిత్యవసర వస్తువును ఒక వ్యక్తి ఎంత పరిమాణంలో నిల్వ చేసుకోవచ్చనే నియంత్రణ విధించే అధికారమూ కేంద్రానికి కల్పిస్తుందీ చట్టం. దీనికి ధరల పెరుగుదలను ప్రాతిపదికగా తీసుకుంటారు. దీనికి అయిదేళ్ల సగటు ధరతో కానీ, లేదంటే ఏడాది కిందట ధరతో కానీ పోల్చి పెరుగుదల స్థాయిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యాన ఉత్పత్తులైతే 100 శాతం ధర పెరిగిన పక్షంలో నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది. పాడవని వ్యవసాయ ఉత్పత్తులకైతే 50 శాతం ధర పెరిగితే నిల్వపై నియంత్రణ విధించే అవకాశం ఉంటుంది.

అయితే, ఆయా వ్యవసాయ వస్తువుల వేల్యూ చైన్ పార్టిసిపెంట్‌లకు ఈ నిల్వ పరిమితి వర్తించదు.

అంటే పంట పండించేవారి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, గోదాం, రవాణా, పంపిణీదారు వరకు ఎవరికీ వర్తించదు.ఈ నియంత్రణలు, నిల్వ పరిమితులు ప్రజాపంపిణీ వ్యవస్థకు వర్తించవు.

ఇప్పటికే నూనెగింజలు, నూనెలు, పప్పుధాన్యాలు వంటి ఉత్పత్తులు కార్పొరేట్ల గుత్తాధిపత్యంలో ఉన్నాయని.. ఇకపై దేశంలోని అన్ని వ్యవసాయ ఉత్పత్తులకీ అదే గతి పట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

వన్ నేషన్ వన్ మార్కెట్' అనేది వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో వర్తకులు, కార్పొరేట్లకు తప్ప సాధారణ రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలిగించదనేది పలువురి వాదన

నిజంగా రైతులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశమే కనుక ఉంటే మార్కెటింగ్ సదుపాయాలు పెంచి, ప్రభుత్వమే అన్ని పంటలను సరైన మద్దతు ధరకు కొనుగోలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరలు లేవని.. కేంద్రం, కొన్ని రాష్ట్రాలు కనీస మద్దతు ధరలు ప్రకటించినా వాటికి చట్టబద్ధత లేదని.. అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి తప్ప రైతులకు ఆ ధర దక్కడం లేదనేది రైతు సంఘాల ఆవేదన..

కనీస మద్దతు ధర అమలు కాకపోతే దానికి ఎవరు బాధ్యులు, కనీస మద్దతు ధర పొందడానికి రైతు కోర్టును ఆశ్రయించే అవకాశాలు లేవని.. కనీస మద్దతు ధర అనేది కేవలం సలహా ధరగా మాత్రమే ఉంటోందని రైతు స్వరాజ్యం నాయకులు రవికుమార్ చెబుతున్నారు.

''కొత్త చట్టాలు అమలులోకి వస్తే వినియోగదారుల మార్కెట్ కంపెనీల నియంత్రణలోకి వెళ్తుంది. రైతులు సంఘటితంగా లేరు.. రైతు సహకార సంఘాలు కూడా బలహీనంగా ఉన్నాయి.. పెట్టుబడి, వసతుల కొరత వంటివి రైతులను, సంఘాలను వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో చట్టాలు ఎన్ని అవకాశాలు కల్పించినా వాటిని రైతులు ఉపయోగించుకోలేరు సరికదా వారికి బదులు కంపెనీలు ఉపయోగించుకుంటాయని ఆయన అంటున్నారు

కాంట్రాక్ట్ ఫార్మింగ్ ద్వారా రైతులను కంపెనీలు ఎలా దోచుకుంటున్నాయో.. ఎలా వారిపై కేసులు పెడుతున్నాయో గుజరాత్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో చూశామని.. భవిష్యత్తులో ఇలాంటివి ఇంకా పెరిగిపోతాయని ఆయన అంటున్నారు.

తమకు పేటెంట్ ఉన్న బంగాళ దుంప రకాలను ఇతర రైతులు పండిస్తున్నారంటూ గత ఏడాది పెప్పికో గుజరాత్‌లో రైతులపై కేసులు పెట్టడాన్ని ఆయన ఉదహణగా చూపిస్తున్నారు.

సంస్థలతో చేసుకునే ఒప్పందాల్లో ఏముందో రైతులందరూ పూర్తిగా అవగాహన చేసుకోలేరని.. ఈ ఒప్పందాలు నేరుగా రైతు, సంస్థ మధ్య జరుగుతాయని.. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మార్కెట్ కమిటీలు కానీ ఏమీ ఉండవని.. అలాంటప్పుడు రైతు మోసపోవడానికి అవకాశాలు ఎక్కువని చెప్పారు.

ఇక ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పేరుతో పాన్ కార్డ్ ఉన్న ఎవరైనా ఈ-వర్తకం చేసుకోవచ్చన్నది వినడానికి బాగానే ఉన్నా ఎంత శాతం మంది రైతులకు అలాంటి సాంకేతిక అవగాహన ఉంటుందన్న ప్రశ్న వినిపిస్తుంది. దీనికంటే ఇప్పటికే ఉన్న ఈ-నామ్ వ్యవస్థను మెరుగుపరిచి రైతులకు మేలు కలిగేలా చేయాలని సూచిస్తున్నారు.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కొత్త చట్టాలు వస్తే వ్యవసాయ ఉత్పత్తులు, రైతులు అంతా కార్పొరేట్ల కబ్జాలోకి వెళ్లిపోతాయని.. ఇది మొత్తంగా ఆహారభద్రతకు ముప్పు తెస్తుందనేది ఇప్పుడు భారత్ బంద్ కు కారణంగా నిలుస్తోంది..

Source: BBC News

For All Tech Queries Please Click Here..!