తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం త్వరగా జరగాలంటే ఇలా చేయండి.

Tuesday, February 4, 2020 03:55 PM Offbeat
తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం త్వరగా జరగాలంటే ఇలా చేయండి.

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని, రెండు మూడు గంటల్లోనే దర్శనం అయిపోవాలి అనుకునే వారు చాలా మందే ఉంటారు. ఎందుకంటే రకరకాల కారణాలు వారి వారి పరిస్థితులను అనుసరించి కోరుకుంటుంటారు. అలాంటి వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా రూ. 300 దర్శనం లేదా శీఘ్ర దర్శనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానిని ఎలా పొందాలి? ఆ టికెట్టు తీసుకుని ఎక్కడి వెళ్లాలి.? అక్కడ ఎలా వ్యవహరించాలి? అనే సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. వారి కోసం ఈ సమాచారం.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన విజయవంతమైన దర్శనాలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ఒక్కటి. ఉద్యోగులు, వ్యాపారులు, సిఫారస్సు లేఖలు పొందలేక దర్శన రుసుము చెల్లించుకోగలిగే ఆర్థిక స్తోమతు ఉన్న వారి కోసం టీటీడీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం కోటాను కూడా 56 రోజులు ముందుగానే అందుబాటులోకి తీసుకు వస్తుంది. ఇంచుమించు రద్దీని అనుసరించి ప్రతీ రోజూ 25 వేల టికెట్లును అందుబాటులోకి తెస్తుంది. ఆ కోటా ఉండే వరకూ ఎవ్వరైనా తమ టికెట్టును బుక్ చేసుకోవచ్చు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం బుక్ చేసుకోవడం ఎలా?

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్టును పొందడానికి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలేదు. కంప్యూటర్ పరిజ్నానం, ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలు నేరుగా మీరే మీరు కోరుకున్న రోజున దర్శన ప్రవేశ సమయాన్ని ఖరారు చేసుకోవచ్చు. www.ttdsevaonline.com వెబ్‌సైట్‌లో లేదా టీటీడీ నిర్వహించే ఈ దర్శన్ యాప్‌లోకి వెళ్లి ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఎన్నుకోవాలి. దీంతో టికెట్టు బుక్ చేసుకునే తెర వస్తుంది. ఆ తెరపై ఉన్న దానిని అనుసరించి ముందు లాగిన్ రిజిస్టర్ చేసుకోవాలి.

ఆ తరువాత లాగిన్ కావాలి. అనతరం తెరపై కనిపించే దర్శన ఖాళీ తేదీలను అనుసరించి మీ వివరాలను నమోదు చేసుకుని ఆన్‌లైన్ చెల్లింపులు చేస్తే చాలు ఆ తేదీకి టికెట్లు బుక్ అవుతాయి. ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఏం చేయాలి.? ఇతర ఇంటర్నెట్ సెంటర్లకెళ్ళి నమోదు చేసుకోవడం లేదా రాష్ట్రంలోని టీటీడీ ఏర్పాటు చేసిన నిర్దేశిత ఈ దర్శన్ కేంద్రాలలో గానీ, పోస్టాఫీసులలోగాని, టికెట్లను బుక్ చేసుకోవచ్చు ? అంతే ఆ సమయానికి తిరుమల చేరుకుని దర్శనానికి వెళ్లడమే.

తిరుమలలో ఎక్కడికి వెళ్ళాలి.?

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లపై తిరుమల దర్శనానికి వచ్చే వారు నేరుగా ఏటీసీ కార్ పార్కింగ్( ఆళ్వార్ ట్యాంక్ కార్ పార్కింగ్) వద్దనున్న కేంద్రానికి చేరుకోవాలి. మీకు ఇచ్చిన సమయాన్ని అనురించి వారు లోనికి అనుమతిస్తారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా గుర్తింపు కార్డు( ఆధార్ కార్డు అయితే మంచిది)ను కలిగి ఉండాలి. బుక్ చేసుకున్న టికెట్టును వెంట తీసుకురావాలి. లోనికి అనుమతించిన రెండు, మూడు గంటలలో దర్శనం పూర్తవుతుంది. అదే రోజునే తిరుగు ప్రయాణం కావచ్చు.

ఎలాంటి డ్రెస్ కోడ్ ఉంటుంది. ?

ఈ దర్శనానికి వచ్చే వారు సాంప్రదాయ దుస్తులను ధరించాలి. అంటే పంచె,దోవతి ఉండాలి. స్ర్తీలైతే నిండుగా ఉండే సాంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతిస్తారు. ప్రాశ్చాత్య దుస్తులలో దర్శనానికి ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించారు. ఈ దర్శనంలో మనిషికి ఉచిత లడ్డూలు కూడా ఇస్తారు. అదనంగా కావాలంటే కొనుక్కునే సౌకర్యం కూడా ఉంటుంది.

For All Tech Queries Please Click Here..!
Topics: