విశాఖలో భయానక పరిస్థితి, ప్రమాదానికి అదే కారణమా..?

Thursday, May 7, 2020 11:20 AM News
 విశాఖలో భయానక పరిస్థితి, ప్రమాదానికి అదే కారణమా..?

విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీ ఘటనతో అక్కడ భయానక పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున 3.30గంటలకు గ్యాస్ లీకేజీ జరగడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలకు అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. ముఖ్యంగా ఫ్యాక్టరీకి అతి సమీపంలో ఉన్న ఆర్ఆర్ వెంకటాపురంపై ప్రభావం ఎక్కువగా పడింది. ఏం జరుగుతుందో తెలియక జనం చెల్లాచెదురుగా పరిగెత్తారు. ఈ క్రమంలో చాలామంది అపస్మారక స్థితిలోకి వెళ్లి రోడ్డు పైనే కుప్పకూలిపోయారు. వీరిలో ఇప్పటివరకూ ఆరుగురు మృతి చెందినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్యాస్ లీకేజీతో దాదాపు 200 మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్టు సమాచారం. వీరిలో 80 మందికి ప్రస్తుతం విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రి సహా మరికొన్ని ఆసుపత్రుల్లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

లాక్ డౌన్ పీరియడ్‌లో తాత్కాలికంగా మూతపడ్డ కంపెనీని బుధవారం రీఓపెన్ చేసే క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సాధారణంగా నిపుణుల పర్యవేక్షణలోనే పరిశ్రమను ఓపెన్ చేయాలని కానీ నైపుణ్యం లేని లేబర్‌తో పరిశ్రమను ఓపెన్ చేయించడంతో ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఫ్యాక్టరీ నుంచి దాదాపు 5కి.మీ మేర గ్యాస్ గాల్లో వ్యాప్తి చెందిందని చెబుతున్నారు. గ్యాస్ ప్రభావంతో చాలామంది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ఎక్కడికక్కడే పడిపోయారు. దీంతో ఆర్ఆర్ వెంకటాపురం సహా సమీప గ్రామాల్లో ప్రతీ ఇంటిని అధికారులు,పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పలువురు రెస్క్యూ సిబ్బంది కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. మూగజీవాలు సైతం గ్యాస్ ధాటికి విలవిల్లాడిపోయాయి. ఇప్పటికే ఫ్యాక్టరీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు విశాఖ నగర పోలీస్ కమిషనర్ మీనా తెలిపారు.

For All Tech Queries Please Click Here..!
Topics: