ఆగని మర్కజ్‌ కేసులు , హాట్‌స్పాట్‌ ల్లో 3.5 లక్షల మందిని కలసిన బృందాలు.

Thursday, April 9, 2020 08:42 AM News
ఆగని మర్కజ్‌ కేసులు , హాట్‌స్పాట్‌ ల్లో 3.5 లక్షల మందిని కలసిన బృందాలు.

కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ అడ్డు అదుపు లేకుండా పెరుగుతోంది. మర్కజ్‌ ఘటనకు సంబంధం ఉండటంతో, దాని వలన వివిధ జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ప్రజలలో , ప్రభుత్వాలలో ఆందోళన కలిగిస్తోంది. బుధవారం నమోదైన 49 కేసుల్లో అత్యధికం హైదరాబాద్, నిర్మల్, రంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 17, నిర్మల్‌ జిల్లాలో 6, హైదరాబాద్‌లో మరో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 25 జిల్లాలకే పరిమితమైన కరోనా, ఖమ్మం జిల్లాకూ పాకింది. రాష్ట్రంలో అత్యధికంగా కేసులు పెరుగుతుండటంతో పాటు హాట్‌స్పాట్ల సంఖ్య కూడా పెరుగుతోంది.

బుధవారం సాయంత్రానికి రాష్ట్రంలో 125 హాట్‌స్పాట్లను గుర్తించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఆయా ప్రాంతాల్లో 3,500 వైద్య బృందాలు 60 వేల ఇళ్లకు తిరిగి 3.5 లక్షల మంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నాయి. వారికెవరికైనా జలుబు, జ్వరం, దగ్గు ఉంటే వెంటనే క్వారంటైన్లో ఉండాలని చెబుతున్నారు. వీలైనన్ని సాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితి తీవ్రమైతే ఆస్పత్రికి రిఫర్‌ చేస్తున్నారు. హాట్‌స్పాట్లలో ప్రధానంగా హైదరాబాద్‌లోనే 60 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత రంగారెడ్డి, నిజా మాబాద్, కామారెడ్డి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, కరీంనగర్, వరంగల్‌లో కొన్ని ప్రాంతాలను హాట్‌ స్పాట్లుగా గుర్తించారు. ఇంటింటికి వెళ్లి వారికేమైనా విదేశీ ప్రయాణ చరిత్ర ఉందా? మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితో సంబంధాలు ఉన్నాయా? కరోనా పాజిటివ్‌ వ్యక్తులను కలిశారా? వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారా? వైరస్‌ అనుమానిత లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లాంటి తదితర వివరాలను వైద్య ఆరోగ్య సిబ్బంది సేకరించింది. కాగా, తొలుత ఇక్కడ ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఆయా హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో వైరస్‌ సామూహికంగా వ్యాప్తి చెందకపోవడంతో ర్యాపిడ్‌ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

For All Tech Queries Please Click Here..!
Topics: