చంద్రబాబు దెబ్బకు నలిగిపోతున్న ఉద్యోగులు..

Saturday, April 20, 2019 08:46 AM News
చంద్రబాబు దెబ్బకు నలిగిపోతున్న ఉద్యోగులు..

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాష్ట్రంలో ప్రధాన శాఖాధిపతుల పరిస్ధితి ముందు నుయ్యి వెనుక గొయ్యిగా మారుతోంది. ఆపద్ధర్మ సీఎంగా ఉంటూనే చంద్రబాబు నిర్వహిస్తున్న సమీక్షలకు హాజరవ్వాలో లేదో తెలియని గందరగోళ పరిస్ధితి అధికారులలో నెలకొంది. దీనికి కారణం తాజాగా చంద్రబాబు నిర్వహించిన పోలవరం సమీక్షలే. గత నాలుగేళ్లుగా పోలవరం ప్రాజెక్టుపై ప్రతీ సోమవారం సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు ఎన్నికల నేపథ్యంలో వాటికి కాస్త విరామం ఇచ్చారు. ఎన్నికల పోలింగ్ ముగియడంతో తిరిగి యథావిథిగా సమీక్షలు మొదలుపెట్టాడు.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా పట్టించుకోకుండా కీలకమైన పోలవరంపై అటు సీఆర్డీయే పనితీరుపైనా సమీక్షించారు. ఎమ్మెల్యేల నివాసాలను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో సీఎం సమీక్షల నిర్వహణ పైన వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కీలక సమీక్షల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని సీఈవో ద్వివేదీని ఆదేశించింది. దీంతో ఆయన అధికారులకు క్లాస్ పీకారు.

ఓవైపు ఈసీ సీరియస్ అయినా సీఎం చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ఇవాళ కాపు కార్పోరేషన్ ఎండీ శివశంకర్‌ను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అధికారుల బదిలీల వ్యవహారం ఈసీ చేతుల్లో ఉంటుందని తెలిసినా కూడా ప్రభుత్వం తరఫున జీవో జారీ చేశారు. దీంతో సీఈసీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సీఎస్ ఎల్వీసుబ్రహ్మణ్యాన్ని వివరణ కోరింది. వెంటనే ఆయన సీఎం సమీక్షల్లో పాల్గొన్న అధికారులకు నోటీసులు జారీ చేశారు. తగిన వివరణ రాకపోతే చర్యలు తీసుకునేందుకు సైతం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.