ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు- మొత్తం పదికి చేరిన బాధితులు..

Wednesday, March 25, 2020 10:42 PM News
ఏపీలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు- మొత్తం పదికి చేరిన బాధితులు..

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో మళ్లీ రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ డీసీతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పదికి చేరింది. అయితే వీరిలో నెల్లూరుకు చెందిన విద్యార్ది కోలుకోవడంతో ఇంటికి పంపి క్వారంటైన్ లలో ఉంచారు.

ఏపీలో ఇవాళ మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ డీసీ నుంచి ఈ నెల 20వ తేదీన ఢిల్లీకి వచ్చిన విజయవాడ విద్యార్ధితో పాటు గుంటూరు నుంచి ఢిల్లీకి మతపరమైన ప్రార్ధనల కోసం వెళ్లిన మరో వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో పరీక్షించి పాజిటివ్ గా తేల్చారు. దీంతో వీరిద్దరూ విజయవాడ ఫీవర్ ఆస్పత్రిలో క్వారంటైన్ వార్డులో ఉన్నారు.

ఇవాళ నమోదైన రెండు కేసులతో కలిపి ఏపీలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ గా తేలిన వారి సంఖ్య 10కి చేరింది. అయితే వీరిలో నెల్లూరుకు చెందిన విద్యార్ధి కోలుకోవడంతో ఇంటికి పంపి హోం క్వారంటైన్ అందిస్తున్నారు. మిగిలిన వారిలో ఒంగోలు, విజయవాడ, కాకినాడ, చిత్తూరులో ఒక్కొక్కరు చొప్పున, విశాఖలో మరో ముగ్గురు పాజిటివ్ లక్షణాలతో క్వారంటైన్ లో ఉన్నారు.

Topics: