45 సంవత్సరాల తరువాత, హంతకుడి ఉరితీత: అర్ధరాత్రి పెను సంచలనం.

Sunday, April 12, 2020 10:38 AM News
45 సంవత్సరాల తరువాత, హంతకుడి ఉరితీత: అర్ధరాత్రి పెను సంచలనం.

కరోనా వైరస్ విధ్వంసాన్ని సృష్టిస్తున్నా మన పొరుగుదేశం అయిన బంగ్లాదేశ్ సంచలనాన్ని రేపింది. తమ దేశ జాతిపిత షేక్ ముజీబుర్ రెహ్మాన్‌ ని చంపిన హంతకుడిని ఉరి తీసింది. బంగ్లాదేశ్ మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. అర్ధరాత్రి 12.01 నిమిషాలకు దేశ రాజధాని ఢాకాలోని కేంద్ర కారాగారంలో హంతకుడిని ఉరి తీసినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ హత్యాకాండ చోటు చేసుకున్న 45 సంవత్సరాల తరువాత హంతకుడిని ఉరి తీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

1975 ఆగస్టు 15వ తేదీన బంగబంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయనతో పాటు పదిమంది కుటుంబ సభ్యులను మిలటరీ జవాన్లు హత్య చేశారు. షేక్ ముజీబుర్ రెహ్మాన్ హత్యాకాండకు అబ్దుల్ మాజీద్ ప్రధాన సూత్రధారిగా తేలింది. ఆయనకు ఉరిశిక్షను విధించింది న్యాయస్థానం. శిక్ష ఖరారైనప్పటి నుంచి ఆయన ఢాకా కెరనిగంజ్ ప్రాంతంలో ఉన్న కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. ఈ అర్ధరాత్రి దాటిన తరువాత ఉరి తీశారు. ఈ విషయాన్ని ఢాకా సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ మహబుబ్ ఉల్ ఇస్లాం తెలిపారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ధృవీకరించింది. ఉరి తీసే సమయంలో సంఘటనా స్థలంలో జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఏకేఎం ముస్తఫా కమాల్ పాషా, సివిల్ సర్జన్, ఢాకా జిల్లా మెజిస్ట్రేట్ తదితరులు ఉన్నట్లు వెల్లడించింది. అబ్దుల్ మాజీద్ భౌతిక కాయాన్ని ఆయన స్వస్థలం భోలా గ్రామానికి పంపించినట్లు అధికారులు తెలిపారు.

For All Tech Queries Please Click Here..!
Topics: