జనవరి 25న పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో విచారణ

Thursday, March 18, 2021 12:00 PM News
జనవరి 25న పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో విచారణ

Amaravati, Jan 23: ఏపీలో పంచాయితీ ఎన్నికలు హైకోర్టు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు (AP Panchayat Elections 2021) నిర్వహించుకోవచ్చంటూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు (AP govt) సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. కాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఎస్సెల్పీ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, జస్టిస్‌ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం (Supreme court of India) ఈనెల 25న విచారించనుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలు వాయిదా వేయాలని ఆయన లేఖలో కోరారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ అవసరం. మొదటి డోస్‌కు, రెండో డోస్‌కు 4 వారాల వ్యవధి అవసరమని.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మొదటి దఫా వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక.. 60 రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం.

తొలి విడతలోనే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ తప్పనిసరని కేంద్రం చెప్పింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు వ్యాక్సిన్‌ ఇవ్వడం సాధ్యం కాదు. ఇలా చేస్తే కేంద్రప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినట్లే. ఎన్నికలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియలు రెండూ సజావుగా జరగాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలను పాటించాల్సిన దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని’’ సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు చేశామని.. సుప్రీంకోర్టులో విచారణ ముగిసేవరకు ఎన్నికల ప్రక్రియలో ముందుకు వెళ్లొద్దని సీఎస్‌ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ శనివారం ఉదయం 10 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నాలుగు విడతల్లో ఫిబ్రవరి 5, 9, 13, 17వ తేదీలలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు గురువారం హైకోర్టు తీర్పు అనంతరం ఎస్‌ఈసీ పేర్కొన్నారు.


 

For All Tech Queries Please Click Here..!