ఆత్మబలిదానం పేరుతో 227 మంది చిన్న పిల్లల్ని దారుణంగా చంపేశారు

Tuesday, September 17, 2019 06:21 AM Crime
ఆత్మబలిదానం పేరుతో  227 మంది చిన్న పిల్లల్ని దారుణంగా చంపేశారు

దుష్టశక్తులు ఉన్నాయనో, లేకుంటే దెయ్యాలు ఉన్నాయనో, లేకుంటే అమితమైన శక్తులు పొందాలనో..ఏదైనా కారణం చేత చిన్నారులను బలిచ్చే ఘటనలు గురించి చాలామంది వినే ఉంటారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయేది అంతకన్నా ఘోరమైన సంఘటన. 227 మంది చిన్న పిల్లల్ని నరబలి ఇచ్చిన సంఘటన ఇది. వివరాల్లోకెళితే.పెరూలోని ఓ చారిత్రక ప్రదేశంలో శవాల గుట్టలు బయటపడ్డాయి. ఇక్కడ ఒకే రోజు 227 మంది పిల్లలను చంపి పూడ్చిపెట్టారు.

పెరూలోని ఉత్తర తీర ప్రాంతంలో తవ్వకాలు జరిపిన ఆర్కియాలజిస్టులకు అధిక సంఖ్యలో అక్కడ పిల్లల సమాధులు కనిపించాయి. 1400 సంవత్సరాల కిందట చిమో రాజుల పాలనలో విపత్తులు తమ సామ్రాజ్యాన్ని నాశనం చేయకుండా ఉండేందుకు చిన్నారులు ప్రాణ త్యాగం చేయాలనే నిబంధన ఉండేదని పరిశోధకులు తెలిపారు. ఈ నేపథ్యంలో వందలాది చిన్నారులను బలిచ్చి ఒకే చోట పూడ్చి పెట్టి ఉంటారని ఆర్కియాలజిస్టులు వెల్లడించారు. 

రాజధాని లిమాకు దగ్గర్లో ఉన్న తీర ప్రాంత పట్టణం హువాన్‌చాకోలో 227 మానవ శరీర అవశేషాల్ని కనగొన్నామని ఆర్కియాలజిస్టు ఫెరెన్‌ కాస్టిలో చెప్పారు. హువాన్‌చాకోలో కొనసాగుతున్న పురావస్తుశాఖ తవ్వకాలపై ఆయన మాట్లాడుతూ దేవుడికి తమను తాము అర్పించుకుని వారంతా సామూహికంగా ప్రాణాలు విడిచి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అందరూ 4 నుంచి 14 ఏళ్ల లోపు వారు కావడం బాధాకరమన్నారు. అవశేషాలన్నీ క్రీస్తు 1200-1400 కాలానికి చెందిన చిమూ సంస్కృతికి చెందిన మనుషులవేనని తెలిపారు.

తొలుత గతేడాది రాజధానికి దగ్గరలో ఉన్న పంపాలా క్రజ్‌ వద్ద తవ్వకాల్లో 56 పుర్రెలు బయటపడ్డాయని చెప్పారు. అనంతరం ఆ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న హువాన్‌చాకోలో తవ్వకాలు జరపగా 190 చిన్నారుల శరీర అవశేషాలు, 200 ఒంటెల అస్థిపంజరాలు బయటపడ్డాయని అన్నారు. తవ్విన చోటల్లా చిన్నారుల పుర్రెలు, చర్మంతో కూడిన బొక్కల గూళ్లు, తల వెంట్రుకలు బయటపడటం కలచి వేసిందని చెప్పారు. 

మొత్తంగా ఇప్పటివరకు 227 మానవ అస్థిపంజరాలు వెలికి తీశామని, తవ్వకాలు కొనసాగుతున్నాయని చెప్పారు. శవాలన్నీ సముద్రం వైపునకు ముఖం చేసి ఉన్నాయని తెలిపారు. ఇంత భారీ ఎత్తున ప్రాణత్యాగం చేసిన ఉదంతాలు బయటపడటం చరిత్రలో తొలిసారని అన్నారు. కొలంబియన్‌ సృంస్కృతికి ముందుదైన చిమూ సంస్కృతి పెరూవియన్‌ తీరం వెంబడి ఈక్వెడార్‌ వరకు విస్తరించింది. ఐంక రాజ్యస్థాపనతో 1475లో అంతరిచింది.

వారి బలికి ముందు అక్కడ భారీ సంఖ్యలో వర్షాలు కురిసినట్లుగా కొన్ని ఆధారాలు లభించాయిని వారు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరిగిందనే దానికి వారు స్పందిస్తూ చిన్నారులు దేవుళ్ల వద్దకు వెళ్లి వారిని శాంతింపజేస్తారని, దానివల్ల విపత్తులు రాకుండా దేవుళ్లు ఆ స్రామ్రాజ్యాన్ని కాపాడతారని అప్పటి ప్రజలు నమ్మేవారని అందులో భాగంగానే ఇలా చేసి ఉంటారనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. 

అయితే ఆ పిల్లలు చనిపోయే వరకు నరకయాతన అనుభవించారనేది ఆ అస్థికలను చూస్తే తెలుస్తోందని పరిశోధకులు తెలిపారు. పిల్లలు ప్రాణాలతో ఉండగానే పదునైన కత్తిని వారి గుండెల్లో దింపి చంపేవారని, ఆ ఆనవాళ్లు శవాలపై ఉన్నాయన్నారు. మరణించిన ఆ పిల్లలను పవిత్ర వస్త్రంలో చుట్టి పూడ్చి పెట్టేవారన్నారు. అయితే, అంత మంది పిల్లల మరణాలకు నిజంగా బలి దానాలే కారణమా? లేదా విపత్తు వల్లే వారు చనిపోయారా? అనేవి ప్రశ్నలుగానే మిగిలాయి. అసలు నిజం ఏమిటనేది నాటి ప్రజలకే తెలియాలి.

For All Tech Queries Please Click Here..!