పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి.. నడిరోడ్డుపై రక్తపుమడుగులో పడి..

Tuesday, March 24, 2020 12:31 PM Crime
 పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి.. నడిరోడ్డుపై రక్తపుమడుగులో పడి..

మరికొన్ని రోజుల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువతి యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్‌ కారణంగా బ్రెయిడ్‌ డెడ్‌ అయ్యి కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఘటన సోమవారం రాత్రి లబ్బిపేట ఎంజీరోడ్డులో చోటుచేసుకుంది. ముత్యాల ఉమా(26) డిగ్రీ పూర్తిచేసుకుని తండ్రికి ఆర్థికంగా సహాయ పడేందుకు నాలుగేళ్లుగా నగరంలోని ఎంజీరోడ్డులోనున్న కాల్‌సెంటర్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తూ లబ్బీపేటలోని లేడిస్‌ హస్టల్‌లో నివాసముంటుంది.

ఇటీవలే కుటుంబ సభ్యులు సమీప బంధువులతో నిశ్ఛితార్థం చేసి ఏప్రిల్‌ 8న వివాహం నిశ్చయించారు. సోమవారం రాత్రి 8గంటల సమయంలో లబ్బీపేట ఎంజీరోడ్డులోని ఏటీఎం సెంటర్‌కు వెళ్లి నగదు డ్రాచేసుకుని రోడ్డు దాటుతుండగా ఏపీ05ఈఎస్‌6895 నెంబర్‌ కలిగిన వాహనంపై ముగ్గురు యువకులు బెంజిసర్కిల్‌ నుంచి బస్‌స్టేషన్‌ వైపు మితిమీరిన వేగంతో దూసుకువచ్చి ఆమెను బలంగా ఢీకొట్టారు. దీంతో యువతి ఎగిరి దూరంగా పడిపోవడంతో తల వెనుక గాయమై తీవ్ర రక్తస్రావంతో అపస్మారకస్థితికి చేరుకుంది. ఈ సమయంలో ఆమెతోపాటు పనిచేసే తోటి ఉద్యోగులు చూసి ఆమెను దగ్గరలోని రమేష్‌ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు.కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆమెను పెళ్లిచేసుకోబోయే యువకుడు, కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. బ్రెయిిన్ డెడ్‌ అయినట్లు డాక్టర్‌లు చెప్పడంతో వారు బోరున విలపిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న కృష్ణలంక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్‌ చేశారు.

Topics: