మేడ్చల్ జిల్లాలో ఇన్‌స్పెక్టర్‌పై పెట్రోల్, కారం పొడితో దాడి చేసిన భూకబ్జాదారులు

Tuesday, February 16, 2021 01:00 PM Crime
మేడ్చల్ జిల్లాలో ఇన్‌స్పెక్టర్‌పై పెట్రోల్, కారం పొడితో దాడి చేసిన భూకబ్జాదారులు

Hyderabad,Dec 25:  మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలం జవహర్‌నగర్‌ మున్సిపాలిటీలో (Jawahar Nagar Violence) అక్రమ కట్టడాల కూల్చివేతల్లో గురువారం ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను (Occupied lands) తొలగించేందుకు వెళ్లిన కమిషనర్‌ మంగమ్మ, కాప్రా తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్, జవహర్‌నగర్‌ ఠాణా సీఐ పి.భిక్షపతిరావును లక్ష్యంగా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోయారు. పెట్రోల్, కారం పొడితో దాడికి  (Attempt murder Case) పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి చేతులకు, కాళ్లకు మంటలు అంటుకున్నాయి.

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లో పలు స్థలాలను అభివృద్ధి పనుల కోసం కేటాయించారు. కార్పొరేషన్‌ పరిధిలో మినీ స్టేడియం నిర్మాణానికి సర్వే నంబరు 706లో 1.37ఎకరాలు, 704లో 3.03 ఎకరాలు, హెర్బల్‌ పార్కు కోసం సర్వే నబరు 759లో 2.11ఎకరాలు, 974లో 1.32 ఎకరాలు, ఆధునిక మరుగుదొడ్లు (మోడ్రన్‌ టాయిలెట్లు) కోసం సర్వే నంబరు 432లో 1500 గజాలు, 495లో 510 గజాలు, సర్వే నంబరు 510లో 17గుంటలు, తంగేడు వనం కోసం సర్వే నంబరు 647లో 1.34 ఎకరాలు, 648లో 4.10 ఎకరాల్లో కేటాయించారు.  

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 432లో 1,500 గజాల స్థలాన్ని మహిళల కోసం పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలని 6 నెలల కింద అప్పటి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. మోడ్రన్‌ టాయిలెట్ల నిర్మాణం కోసం కలెక్టర్‌ స్థలం కేటాయించినప్పటికీ అందులో ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మార్వో గౌతమ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం అక్రమ కట్టడాలను నేలమట్టం (Demolition of illegal structures) చేసింది. అప్పటినుంచి ఆ భూమిని తాత్కాలిక డంపింగ్‌ కేంద్రంగా మున్సిపల్‌ అధికారులు వాడుతున్నారు.

 అయినా కూడా జవహర్‌నగర్‌ వాసి పూనమ్‌ చంద్‌ కుటుంబం మళ్లీ రెండు గదులు నిర్మించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్లాన్‌ చేశారు. అయితే వాసం వెంకటేశ్వర్లు స్థానంలో కలెక్టర్‌గా వచ్చిన శ్వేతా మహంతి ఆ భూమిలో మహిళల కోసం షీ టాయిలెట్స్‌ పనులు చేపట్టాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల కింద ఇక్కడకు వచ్చిన కార్పొరేషన్‌ అధికారులను పూనమ్‌ చంద్‌ కుటుంబసభ్యులు చనిపోతామంటూ బెదిరించడంతో వెనుదిరిగారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ శ్వేతమహంతి ఆదేశాల మేరకు సర్వే నంబరు 432లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు గురువారం సాయత్రం 4గంటలకు అక్కడకి చేరుకున్నారు.
 
20 నుంచి 30 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ రెండు గదులను కూల్చేందుకు వచ్చారు. జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధం అవుతుండగా పూనమ్‌ చంద్, శాంతి కుమారి ఆ గదిలోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గడియపెట్టుకున్నారు. ఇది గమనించిన ఎస్సై సైదులు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లగా, గది కిటికీలోంచి కారం పొడి చల్లారు. కర్రలకు బట్టలుచుట్టి వాటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి బయటకు విసిరారు.

సీఐ భిక్షపతి నేతృత్వంలోని పోలీసులు అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టారు. అయితే గది లోపల కాగడాల మంటలు ఉండటంతో పూనమ్‌ చంద్‌ కుటుంబసభ్యులకు ఏమైనా అవుతుందని సీఐ తలుపులను కాళ్లతో తన్నారు. వెంటనే ఆ గదిలో ఉన్న శాంతి కుమారి నేరుగా పెట్రోల్‌ చల్లడంతో సీఐ భిక్షపతిపై పడింది. దీంతో  సీఐ భిక్షపతిరావుకు మంటలు అంటుకున్నాయి. కిందపడి పొర్లడంతో మంటలు ఆరిపోయినా.. అప్పటికే రెండు చేతులు, వీపు భాగంలో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఓ మహిళకు కూడా గాయాలయ్యాయి. 

జవహర్‌నగర్‌ ఘటనలో పలువురిపై కేసు నమోదైంది. సీఐ భిక్షపతి, కానిస్టేబుల్‌ అరుణ్‌పై కిరోసిన్‌ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  ఆక్రమణదారులు పూనమ్‌ చంద్‌, నిహాల్‌ చంద్‌, శాంతిదేవి, నిర్మల్‌, బాల్‌సింగ్‌, చినరాం పటేల్‌, గీత, గోదావరి, యోగి కమల్‌, మదన్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. వీరితోపాటు స్థానిక నాయకులు శంకర్‌, శోభారెడ్డిపై కూడా కేసు రిజిస్టర్‌ చేశారు. ఈ ఘటనపై ఉప్పల్‌ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితామూర్తి దర్యాప్తును పర్యవేక్షించనున్నారు. 

భూ కబ్జాదారుల దాడిలో గాయపడిన సీఐ భిక్షపతిరావు, కానిస్టేబుల్‌ అరుణ్‌ సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసోలేషన్‌లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. భిక్షపతిరావు కాళ్లు, చేతులకు 45 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

For All Tech Queries Please Click Here..!