అత్తాపూర్‌లో ఎంఐంఎ నేత హత్యకు అప్పే కారణం

Friday, March 12, 2021 01:00 PM Crime
 అత్తాపూర్‌లో ఎంఐంఎ నేత హత్యకు అప్పే కారణం

Hyderabad, Jan 12:  హైదరాబాద్‌లోని అత్తాపూర్ లో అర్ధరాత్రి ఎంఐఎం నాయకులు సలీం ను అతికిరాతకంగా గుర్తుతెలియని వ్యక్తులు నరికి చంపారు. అత్తాపూర్‌లోని ఒక ఫంక్షన్ కు హాజరై తిరిగి వెళ్తున్న సమయంలో రోడ్డుమీద కత్తులు రాళ్లతో ఎటాక్ చేసి (MIM Leader Murder Case) చంపేశారు, అత్తాపూర్ లోని రోడ్ నెంబర్ పిల్లర్ నెంబర్ 248 వద్ద ఈ దారుణ ఘటన (Murder in Hyderabad) జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి (Shamshabad DCP Prakash Reddy) సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమనడంతో పాటు హోటల్‌ను రాసివ్వమ్మని వడ్డీ వ్యాపారి చేసిన ఒత్తిడే అతని హత్యకు (Murder At Pillar No 248) కారణమైందని పోలీసులు తెలిపారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ఎంఎంపహాడిలో నివాసముండే షేక్‌ రషీద్‌(29) స్థానికంగా గరీబ్‌నవాజ్‌ పేరుతో హోటల్‌ నడిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు హోటల్‌ను బాగు చేయడానికి ఎంఎంపహాడిలోనే నివాసముండే రియల్‌ఎస్టేట్, వడ్డీ వ్యాపారి మహ్మద్‌ ఖలీల్‌ (33) నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కాగా ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. 

అయితే లాక్‌డౌన్‌ కారణంగా హోటల్‌ మూసివేయడంతో స్థానికంగా మరిన్ని అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఇటీవల ఖలీల్‌ వద్దకు వెళ్లిన రషీద్‌ మరో రూ.50 లక్షల అప్పుగా ఇవ్వమని కోరాడు. అందుకు ఖలీల్‌ నిరాకరించడంతో పాటు ముందుగా తీసుకున్న అప్పును వెంటనే చెల్లించడమా..లేదా హోటల్‌ను తన పేరుమీద రాయడమో ఏదో ఒకటి చేయాలని ఒత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలో ఖలీల్‌ ఒత్తిడి పెరుగుతుండటంతో ఏం చేయాలో తెలియని షేక్‌ రషీద్‌ హత్యకు పథకం రచించాడు. 

తన హోటల్‌లో వంటవాళ్లుగా పనిచేస్తున్న ఎంఎంపహాడికి చెందిన మహ్మద్‌ అజ్మత్‌(28), సయ్యద్‌ ఇమ్రాన్‌(28)తో కలిసి ఖలీల్‌ను అంతమొందించాలని పథకం వేశాడు. ఇందుకోసం రషీద్, ఇమ్రాన్‌లు చార్మినార్‌కు వెళ్లి రెండు కత్తులు కొనుగోలు చేశారు. వడ్డీవ్యాపారి ఖలీల్‌ ఆదివారం మధ్యాహ్నం షేక్‌రషీద్‌ నడిపిస్తున్న హోటల్‌ వద్దకు వెళ్లి వడ్డీ డబ్బులు ఇవ్వమని అడిగాడు. సాయంత్రం వరకు సర్దుతానని రషీద్‌ అతనికి చెప్పి పంపాడు. 

రాత్రి 10 గంటల సమయంలో రషీద్, అజ్మత్‌ ఓ ఆటోను మాట్లాడుకుని అందులో సిమెంట్‌ ఇటుకలు సిద్దం చేసుకుని పిల్లర్‌ నంబరు 248 వద్దకు చేరుకున్నారు. అక్కడికే సయ్యద్‌ ఇమ్రాన్‌ను రప్పించుకున్నారు. డబ్బుల కోసం ఖలీల్‌ను పిల్లర్‌నంబరు 248 హెచ్‌ఎఫ్‌ కన్వెన్షన్‌ వద్దకు రావాలని రషీద్‌ ఫోన్‌ చేయడంతో అతడు హోండా యాక్టివా వాహనంపై అక్కడకి చేరుకున్నాడు. రాత్రి 11.15 గంటల సమయంలో అక్కడికి చేరుకుని రషీద్‌తో మాట్లాడుతున్న సమయంలో వెనక్కి నుంచి అజ్మత్, ఇమ్రాన్‌ సిమెంట్‌ ఇటుకలతో దాడి (attapur murder) చేశారు. 

ఇక గాయపడిన స్థితిలో పరుగులు పెడుతున్న అతడిని వెంటాడి మరోసారి కత్తులతో దాడి చేయడంతో పాటు సిమెంట్‌ ఇటుకలతో బాది అంతమొందించారు. అక్కడే ఉన్న మృతుడి వాహనం తీసుకుని పరారయ్యారు. అక్కడ దుస్తులు మార్చుకున్న వాళ్లు రక్తంతో ఉన్న దుస్తులను తీసుకొచ్చి వ్యవసాయ కళాశాల వద్ద పారేశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్, సీఐ సురేష్‌ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

సినిమాను తలపించేలా ఈ హత్య దారుణం దాదాపు 10 నిమిషాల పాటు సాగినా ఒక్కరు కూడా అడ్డు రాలేదు. స్థానికులు సెల్‌ఫోన్‌లలో ఘటనను షూట్ చేయడానికి ఆసక్తి చూపించారే తప్ప ఆ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. 

For All Tech Queries Please Click Here..!