అమెరికాలో నలుగురు తెలుగువారు అనుమానాస్పద మృతి

Monday, June 17, 2019 10:12 AM Crime
అమెరికాలో నలుగురు తెలుగువారు అనుమానాస్పద మృతి

అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి వెస్ట్‌డెస్‌ మోయిన్స్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తెలుగువారు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుల శరీరంలోకి తుపాకీ బుల్లెట్లు దూసుకుపోయాయి. ఈ విషయమై నగర పోలీస్‌ మాట్లాడుతూ 65 స్ట్రీట్‌లోని ఓ ఇంట్లో సమస్య ఉందని శనివారం ఉదయం 10 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) 911కు ఫోన్‌కాల్‌ వచ్చింది. దీంతో మా పోలీస్  యూనిట్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇంట్లో బుల్లెట్‌ గాయాలతో రక్తపు మడుగులో ఉన్న నలుగురి మృతదేహాలను గుర్తించాం. ఈ ఘటనలో చంద్రశేఖర్‌ సుంకర(44), లావణ్య సుంకర(41)తో పాటు వారి ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు అని పోలీసులు తెలిపారు.

వీరి ఇంటికి వచ్చిన బంధువుల్లో ఒకరు నలుగురి మృతదేహాలను చూడగానే భయంతో పోలీసులకు సమాచారం అందించారు. రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం లావణ్య–చంద్రశేఖర్‌ ఈ ఇంటిని 2019, మార్చి 25న కొనుగోలు చేశారని తెలిపారు. పోస్‌మార్టం తర్వాతే మరణానికి గల కారణాన్ని అధికారికంగా చెప్పగలమన్నారు. ఈ దుర్ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఇక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయనీ, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని  పోలీసులు చెప్పారు. ముగ్గురు కుటుంబ సభ్యులను చంద్రశేఖరే కాల్చిచంపాడనీ, అనంతరం తనను తాను కాల్చుకున్నాడని కొందరు స్థానికులు తెలిపారు. ఆయన గతకొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని వెల్లడించారు.

For All Tech Queries Please Click Here..!