కబడ్డీ కోర్టులోనే గుండెపోటుతో మృతి చెందిన ఆటగాడు

Monday, March 15, 2021 01:15 PM Crime
కబడ్డీ కోర్టులోనే గుండెపోటుతో మృతి చెందిన ఆటగాడు

Amaravati, Jan 17: వైయస్సార్ కడప జిల్లాలో వల్లూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లిన ఆటగాడు అవుట్‌ అయిన తర్వాత తిరిగొస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కోర్టులోనే మృతి (Kabaddi Palyer Died in Court) చెందాడు. వల్లూరు మండలంలోని గంగాయపల్లి మోడల్‌ స్కూల్‌ ఆవరణలో ఆర్కే యువసేన  ఆధ్వర్యంలో శనివారం కబడ్డీ పోటీలు జరిగాయి. చెన్నూరు, తప్పెట్ల గ్రామాల జట్లు తలపడ్డాయి.

కొండపేటకు చెందిన నరేంద్ర ప్రత్యర్ధి జట్టుపై కూతకు వెళ్లాడు. అవుట్‌ అయిన తర్వాత వెనక్కు తిరిగొస్తూ ఒక్కసారిగా కుప్పకూలి కబడ్డీ కోర్టులోనే ప్రాణాలు (heart attack) వదిలాడు. దీంతో నరేంద్ర సొంత గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విషాద ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరు మండలం, కొండపేటకు చెందిన పెంచలయ్య,జయమ్మలకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు స్థానికంగా రజక వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి చిన్నకుమారుడు నరేంద్ర ఎం.కాం చదువుకున్నాడు. చిన్నతనం నుంచి కబడ్డీ అంటే నరేంద్రకు ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి వివిధ టోర్నీల్లో పాల్గొని ట్రోఫీలు సాధించాడు. 

ఈ క్రమంలో వల్లూరు మండలం, గంగాయపల్లెలో జరిగిన నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీలో పాల్గొన్నాడు. మ్యాచ్ మధ్యలో కూతకు వెళ్లిన నరేంద్రను ప్రత్యర్థులు టాకిల్ చేశారు. పాయింట్ కోల్పోయిన అనంతరం తిరిగి కోర్టులోకి వస్తుండగా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. జట్టు సభ్యులు, కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే నరేంద్ర మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

కోర్టులో ప్రత్యర్థి జట్టు సభ్యులంతా ఒక్కసారిగా మీదపడటంతో అతని గుండెపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. నరేంద్ర కూతకు వెళ్లి, కుప్పకూలిపోయిన ఘటన అక్కడే ఉన్న ఒకరు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. తొలుత నరేంద్ర నడుస్తుండగా జారిపడినట్లు అందరూ భావించారు. కానీ అతను చనిపోయాడని తెలిసి షాక్ కు గురయ్యారు. నరేంద్ర తండ్రి  పెంచలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్లు ఇచ్చిన నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
 
 

For All Tech Queries Please Click Here..!