గూగుల్ పే లో రీఛార్జి 64 వేలు స్వాహా..

Wednesday, April 29, 2020 09:29 AM Crime
గూగుల్ పే లో రీఛార్జి 64 వేలు స్వాహా..

ఫోన్‌ రీచార్జ్‌ చేసిన రూ.200 విషయం అడగటానికి ఇంటర్‌నెట్‌లో ఉన్న నకిలీ కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసిన నగరవాసి రూ.64వేలు నష్టపోయాడు. ఈ వ్యవహారంపై బాధితుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మాసబ్‌ ట్యాంక్‌ ప్రాంతానికి చెందిన ఓ ఫొటోగ్రాఫర్‌ సోమవారం తన భార్య ఫోన్‌కు గూగుల్‌ పే ద్వారా రూ.200 రీచార్జ్‌ చేశారు. అయితే మంగళవారం ఉదయానికీ ఆ ఫోన్‌ రీచార్జ్‌ కాలేదు. గూగుల్‌ పే ద్వారా నగదు చెల్లించి ఉండటంతో ఆ సంస్థ వారిని సంప్రదించడానికి ప్రయత్నించాడు. వారి నంబర్‌ కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేసిన బాధితుడికి ఓ నంబర్‌ కనిపించడంతో దానికి కాల్‌ చేశాడు.

ఆ నంబర్‌ సైబర్‌ నేరగాళ్లది కావడంతో వారు బాధితుడు చెప్పే విషయం మొత్తం విని రెండు లింకులు పంపారు. బాధితుడి ఫోన్‌ నుంచి ఆ లింకులను ఫలానా నంబర్‌కు పంపితే వెంటనే రూ.200 రీచార్జ్‌ అయిపోతుందని నమ్మబలికారు. బాధితుడు అలానే చేయడంతో అతడి రెండు బ్యాంకు ఖాతాలకు చెందిన యూపీఐ లింకు సైబర్‌ నేరగాళ్ల ఫోన్‌కు వెళ్లిపోయింది. దీని ద్వారా నాలుగు లావాదేవీలు చేసిన సైబర్‌ నేరగాళ్లు బాధితుడి ఖాతా నుంచి రూ.64వేలు తమ ఖాతాల్లోకి మల్లించుకున్నారు. ఈ విషయం గమనించిన బాధితుడు మంగళవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి విషయంలో వినియోగదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 

For All Tech Queries Please Click Here..!
Topics: