టీవీ 9 సీఈవోగా బరూన్ దాస్, ఎవరు ఇతను ?

Tuesday, October 1, 2019 05:39 PM Business
టీవీ 9 సీఈవోగా బరూన్ దాస్, ఎవరు ఇతను ?

తెలుగు మీడియా దిగ్గజం టీవీ9 సంస్థకు కొత్త సీఈవో వచ్చారు. జీ మీడియా సీఈవోగా గత ఐదేళ్లు పని చేసిన బరూన్ దాస్ టీవీ9 కొత్త సీఈవోగా నియమితులయ్యారు. అయితే ఇటీవల ఫోర్జరీ కేసులో అప్పటివరకూ సీఈవోగా కొనసాగిన రవి ప్రకాష్ ని తప్పించి మహేందర్ మిశ్రాని కొత్త సీఈవోగా నియమించిన విషయం తెలిసిందే.  ఇప్పటివరకూ మధ్యంతర సీఈవోగా విధులు నిర్వర్తించిన మహేంద్ర మిశ్రా ఇక నుంచి టీవీ 9 బోర్డుకు ప్రధాన సలహాదారుగా వ్యవహరించనున్నారు.

 దక్షిణ, పశ్చిమ భారత్‌లలో అగ్రస్థానానికి చేరుకున్న టీవీ9.. ఇటీవల భారత్‌వర్ష్ అనే జాతీయ హిందీ న్యూస్ ఛానెల్‌ను ప్రారంభించింది. జీ మీడియా సీఈవోగా గత ఐదేండ్లుగా పని చేసిన బరూన్ దాస్.. మద్రాస్ ఐఐటీ, కోల్‌కతా ఐఐఎం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి. ఏబీపీ న్యూస్, ఇండియా టుడే గ్రూప్, ఆస్ట్రో అల్ ఆసియా నెట్‌వర్క్ కౌలలాంపూర్, ఏబీపీ గ్రూప్ వంటి వాటిల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఈ సందర్భంగా బరూన్ దాస్ మాట్లాడుతూ.. టీవీ 9 గ్రూప్ బాధ్యతలను అందుకున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 

ఈ ఛానెల్‌ను జాతీయ స్థాయిలో విస్తరించడానికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. సంస్థ హోల్‌టైమ్ డైరెక్టర్ సింగారావు మాట్లాడుతూ.. జర్నలిజం విలువలను పెంపొందించే బాధ్యతకు తమ సంస్థ కట్టుబడి ఉందని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో అగ్రస్థానం చేరుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన సలహాదారు మహేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. టీవీ 9 గ్రూపును జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లడంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. బరూన్ నాయకత్వంలో సంస్థ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

అయితే రెండు నెలల్లోనే మహేందర్ ని ఎందుకు తప్పిచారో అనే విషయంపై మాత్రం క్లారిటీ రావట్లేదు. కానీ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం టీవీ9 రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిల్లో ఉండటంతో రెండు నెలల్లోనే మిశ్రాకు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. పైగా కన్నడ చానల్ సీఈవోని నెంబర్1 గా నిలబెట్టినందుకు, సంస్థలో కీలక పాత్ర పోషించనందుకు ఒప్పందం ప్రకారం సంస్థ లాభాల్లో మిశ్రాకు 8.70 కోట్లు రావాల్సి ఉందని సమాచారం. రవి ప్రకాష్ సీఈవోగా ఉన్న సమయంలో మిశ్రా జర్నలిస్టుగా ఉండేవారు. అయితే ఆయన కష్టాన్ని, నాయకత్వ లక్షణాలని గుర్తించి కన్నడ చానల్ బాధ్యతలు అప్పగిస్తూ సంస్థ లాభాల్లో వాటా ఆఫర్ చేశారు. అయితే రవి ప్రకాష్ కేసులో చిక్కుకోవడంతో ఆయన పోస్టుని మిశ్రాకు ఇచ్చారు. ఇప్పుడు మిశ్రాని రెండు నెలలో తొలగించి బరూన్ దాసుకు బాధ్యతలు అప్పగించారు. 

For All Tech Queries Please Click Here..!