Manufacturing Row: ఏపీకి మరో కార్ల కంపెనీ వచ్చేస్తోంది, ఎక్కడ అనేది సస్పెన్స్ !

Thursday, November 12, 2020 02:00 PM Business
Manufacturing Row: ఏపీకి మరో కార్ల కంపెనీ వచ్చేస్తోంది, ఎక్కడ అనేది సస్పెన్స్ !

 Amaravati, Oct 26: ఆంధ్రప్రదేశ్ కు మరో కార్ల కంపెనీ రాబోతుంది..మరో ప్రతిష్టాత్మక వాహనాల తయారీ యూనిట్‌ ఏపీలో (Andhra pradesh) ఏర్పాటు కాబోతోంది. ప్రముఖ స్పోర్ట్స్‌ వెహికల్‌ బ్రాండ్‌ లంబోర్గిని ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను (Lamborghini Electric Vehicle Manufacturing Unit, Lamborghini) రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. గోల్ఫ్, ఇతర క్రీడల్లో వినియోగించే ప్రీమియం బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి పుణెకు చెందిన కైనటిక్‌ గ్రీన్‌ సంస్థ (Kinetic‌ Green‌ Company) ప్రతిపాదనలు పంపింది.

రాష్ట్రంలో సుమారు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లు, చార్జింగ్‌ స్వాపింగ్, ఆర్‌ అండ్‌ డీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కైనటిక్‌ గ్రీన్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఈమేరకు కైనటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ అండ్‌ పవర్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌ సీఈవో సులజ్జా ఫిరోడియా మొత్వాని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి లేఖ రాశారు.

కైనటిక్‌ సంస్థ పోర్టు ఆధారిత సెజ్‌ ప్రాంతంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో యూనిట్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. పోర్ట్ ఆధారితం అనడటంతో ఆ రేసులో నెల్లూరు, చిత్తూరు, విశాఖ జిల్లాలు రేసులో ఉన్నాయి.. పరిస్థితి చూస్తే నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. లంబోర్గిని వాహనాలతో పాటు కైనటిక్‌ గ్రీన్‌ బ్రాండ్‌ పేరుతో వాహనాలను స్థానిక అవసరాలకు తోడు ఎగుమతి చేసే విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. 

వచ్చే పదేళ్లలో కేవలం రాష్ట్రంలోనే 5 లక్షల ఎలక్ట్రిక్‌ వాహనాలు విక్రయిస్తామని.. దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. భారీ మెగా ప్రాజెక్టుగా దీన్ని పరిగణించి దానికి అనుగుణంగా రాయితీలు ఇవ్వాల్సిందిగా కోరింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఆర్‌ అండ్‌ డీలో అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాణిజ్యపరంగా వినియోగిస్తే దానిపై ఒక శాతం రాయల్టీ చెల్లించడానికి కంపెనీ ప్రతిపాదించింది. దేశంలో లంబోర్గిని బ్రాండ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు గాను కైనటిక్‌ గ్రీన్‌ సంస్థతో 2018లో ఒప్పందం చేసుకుంది.

For All Tech Queries Please Click Here..!