ఫ్లాష్.. ఫ్లాష్.. జీప్ కంపాస్ ట్రయల్ హాక్ వచ్చేసింది - 50 వేలకే బుకింగ్స్ ప్రారంభం

Wednesday, June 12, 2019 04:00 PM Automobiles
ఫ్లాష్.. ఫ్లాష్.. జీప్ కంపాస్ ట్రయల్ హాక్ వచ్చేసింది - 50 వేలకే బుకింగ్స్ ప్రారంభం

ఆఫ్ రోడ్ వాహనాల తయారీలో దిగ్గజ సంస్థగా పేరుగాంచిన అమెరికాకు చెందిన జీప్ సరిగ్గా రెండేళ్ల క్రితం దేశీయ విపణిలోకి కంపాస్ ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది. జీప్ కంపాస్ ఎస్‌యూవీకి మంచి ఆదరణ లభించడంతో ఇప్పుడు కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు జీప్ ఇండియా సంస్థ సన్నద్దమైంది.

సాధారణ జీప్ కంపాస్ ఎస్‌యూవీతో పోల్చుకుంటే కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్ ఆఫ్‌రోడింగ్ వెహికల్స్ విభాగంలో రారాజు అని చెప్పవచ్చు. ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ అన్ని చక్రాలకు సరఫరా చేయడం, ఎత్తు పల్లాలను సునాయసంగా చేధించే అధునాతన సాంకేతికత, ఇతర లగ్జరీ కార్లు, ఎస్‌యూవీలతో పోల్చితే ఏ మాత్రం తీసిపోని సరికొత్త ఇంటీరియర్ ఫీచర్లు మరియు టెక్నాలజీ దీని సొంతం.

ప్యానరోమిక్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, కీ లెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, ఆండ్రాయిడ్ ఆటో లేదా ఆపిల్ కార్ ప్లే అప్లికేషన్ సపోర్ట్ చేయగల 8.4-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బ్లాక్ ఇంటీరియర్, సౌకర్యవంతమైన సీట్లు, ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు అత్యుత్తమ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో పాటు ఇంకా ఎన్నో విశిష్టతలు జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ ఎస్‌యూవీ సొంతం.

సాంకేతికంగా జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ 2.0-లీటర్ టర్భో-డీజల్ ఇంజన్‌తో లభ్యమవుతోంది. ఇది అత్యధికంగా 173 బీహెచ్పీ పవర్ మరియు 350ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ పవర్ నాలుగు చక్రాలకు అందుతుంది. భద్రత పరంగా జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్లో సైడ్ మరియు కర్టెన్‌ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిసెంట్ కంట్రోల మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఎన్నో సేఫ్టీ ఫీచర్లు దీని సొంతం.

జీప్ ఇండియా విభాగం కంపాస్ ట్రయల్‌హాక్ వేరియంట్‌ను అతి త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న  తమ 82 జీప్ అధీకృత డీలర్ల వద్ద కంపాస్ ట్రయల్‌హాక్ మీద రూ. 50,000 టోకెన్ ధరతో బుకింగ్స్ ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. జీప్ కంపాస్ ట్రయల్‌హాక్ విడుదల మరియు మరింత సమాచారం కోసం మాతో కలిసి ఉండండి.

For All Tech Queries Please Click Here..!