దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్..

Thursday, December 26, 2019 08:55 PM Automobiles
దుమ్ములేపిన మారుతి డిజైర్ సేల్స్..

మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారు సేల్స్ పరంగా ఇండియన్ మార్కెట్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 2019 సంవత్సరం ప్రారంభం నుండే దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కున్నప్పటికీ మారుతి డిజైర్ మోడల్‌కు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో గడిచిన 8 నెలల్లో ఏకంగా లక్షా 20 వేల మారుతి డిజైర్ కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మారుతి డిజైర్ తొలి స్థానంలో నిలిచింది.

ప్రతి ఏటా భారీ విక్రయాలు నమోదు చేస్తున్న మారుతి డిజైర్ మోడల్‌ ఈ మధ్యనే 20 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని చేరుకుంది. ఒక్క 2018-19లోనే 2.5లక్షల కార్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ మొత్తం విక్రయాల్లో మారుతి డిజైర్ మోడల్ 60 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుని అగ్ర స్థానంలో నిలిచింది.  డిజైర్ మొత్తం విక్రయాల్లో 50 శాతానికి పైగా మొదటి సారి కారు కొంటున్న కస్టమర్లే అధికంగా ఉన్నట్లు మారుతి పేర్కొంది. 

కొత్త తరం మారుతి డిజైర్ సెడాన్ కారు 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. మారుతి డిజైర్ ధరల శ్రేణి రూ. 5.83 లక్షల నుండి రూ. 9.53 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ (ఇండియా)గా ఉంది.

కాంపాక్ట్ సెడాన్ అంటే ఏమిటి?
బాడీ స్టైల్ పరంగా మారుతి డిజైర్‌ను కాంపాక్ట్ సెడాన్ అంటారు. వెనుక భాగంలో పొడవాటి డిక్కీతో నాలుగు మీటర్ల పొడవులోపు ఉండే కార్లను కాంపాక్ట్ సెడాన్ అంటారు. మారుతి డిజైర్, ఫోర్డ్ ఆస్పైర్, హ్యుందాయ్ ఎక్సెంట్, హోండా అమేజ్ మరియు అతి త్వరలో విడుదల కానున్న టయోటా ఆరా వంటి మోడళ్లు కాంపాక్ట్ సెడాన్ కిందకు వస్తాయి.

For All Tech Queries Please Click Here..!
Topics: