ఏబీఎస్ టెక్నాలజీతో హోండా ఎక్స్-బ్లేడ్ బైక్ విడుదల

Saturday, December 8, 2018 09:46 PM Automobiles
ఏబీఎస్ టెక్నాలజీతో హోండా ఎక్స్-బ్లేడ్ బైక్ విడుదల

హోండా మోటార్ సైకిల్స్ మార్కెట్లోకి తమ ఎక్స్-బ్లేడ్ బైకును ఏబీఎస్ టెక్నాలజీతో ప్రవేశపెట్టింది. హోండా ఎక్స్-బ్లేడ్ ఏబీఎస్ టెక్నాలజీ వేరియంట్ ధర రూ. 87,776 లు ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది. హోండా ఎక్స్-బ్లేడ్ సాధారణ వేరియంట్ ధర రూ. 79,768 తో పోల్చుకుంటే ఏబిఎస్ వెర్షన్ ధర రూ. 8,000 అధికంగా ఉంది.

హోండా టూ వీలర్స్ ఎక్స్-బ్లేడ్ బైకును ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వాహన ప్రదర్శనలో ఆవిష్కరించి, ఇదే ఏడాది మార్కెట్లోకి లాంచ్ చేసింది. అతి త్వరలో 125సీసీ కంటే ఎక్కువ ఇంజన్ కెపాసిటి గల అన్ని బైకుల్లో ఏబీఎస్ టెక్నాలజీని భారత ప్రభుత్వం తప్పనిసరి చేయనుండటంతో హోండా ఎక్స్-బ్లేడ్ బైకును కస్టమర్ల సేఫ్టీ పరంగా ఏబీఎస్ వెర్షన్‌లో లాంచ్ చేసింది.

రెగ్యులర్ హోండా ఎక్స్-బ్లేడ్‌తో పోల్చుకుంటే ఏబీఎస్ వేరియంట్లో డిజైన్, ఫీచర్లు మరియు ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. సాంకేతికంగా ఇందులో అదే మునుపటి 163.71సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 13.93బిహెచ్‌పి పవర్ మరియు 13.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.