సీటు శ్రీరామ్‌దే... తీర్పు ఏటు వైపు? పరిటాల ఫ్యామిలీ గురించి చరిత్ర ఏం చెబుతోంది?

Friday, March 15, 2019 10:00 AM Politics
సీటు శ్రీరామ్‌దే... తీర్పు ఏటు వైపు? పరిటాల ఫ్యామిలీ గురించి చరిత్ర ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడటంతో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే టీడీపీ అధిష్టానం రాప్తాడు నియోజకవర్గ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్‌ను ఎంపిక చేసింది.

పరిటాల ఫ్యామిలీ రాజకీయ చరిత్ర గురించి ప్రత్యేక కథనం:
పరిటాల కుటుంబం అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ సంచలనం. ముందు నుండే వామపక్ష భావజాలంతో ఉన్న పరిటాల రవీంద్ర తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. పెనుకొండ, ధర్మవరం ప్రాంతాల్లో ఫ్యాక్షన్ మహమ్మారికి ఎదురొడ్డి నిలబడ్డారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో తొలిసారి పెనుకొండ నుండి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజీనామా చేసి 1996లో మళ్లీ గెలుపొందారు. 1999 మరియు 2005లో జరిగిన అసెంంబ్లీ ఎన్నికల్లో వరుసగా గెలిచి పరిటాల రవి తన సత్తా చాటాడు. మంత్రిగాను పనిచేశాడు. 2005 జనవరి 24న అనంతపురం నగరంలోని పార్టీ ఆఫీసులోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు.

భర్త మరణంతో పరిటాల సునీతకు రాజకీయాల్లో రావాల్సిన పరిస్థితి వచ్చింది. 2014 వరకు తొమ్మిదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ప్రత్యర్థులను ఎదుర్కొంది. 2005లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తన భర్త రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. ఆ తర్వాత 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభనజలో పరిటాల సొంత గ్రామం రామగిరి మండలంలోని వెంకటాపురం రాప్తాడు నియోజకవర్గానికి మారింది. దాంతో పెనుకొండ నుంచి రాప్తాడుకు మారారు సునీత. 2009 మరియు 2014లోను రాప్తాడు నుండి పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు పరిటాల సునీత.

పరిటాల ఫ్యామిలీ నుండి సునీత మరియు శ్రీరామ్ ఇద్దరికీ సీట్లు ఆశించడంతో అధిష్టానం మేరకు కుటుంబానికి ఒక్క సీటు మాత్రమే ఇస్తుండటంతో తనయుడి కోసం పరిటాల సునీత అసెంబ్లీ పోరు నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు తన తండ్రి పరిటాల రవి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించనున్నారు పరిటాల శ్రీరామ్. పరిటాల సునీత మంత్రి అయ్యాక జిల్లాలో టీడీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు శ్రీరామ్. కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పరిటాల సునీత ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకొని రాప్తాడు నియోజకవర్గ అభ్యర్థిగా అసెంబ్లీకి పంపాలని నిర్ణయించారు. పరిటాల వారసుడు శ్రీరామ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని రాప్తాడు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను, ప్రజలను కోరారు. రాప్తాడుతో పాటు హిందూపురం, పెనుకొండ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో పరిటాల కుటుంబానికి బలం బలగం బాగానే ఉంది. ఎన్నో ఏళ్ల నుండి పరిటాల కుటుంబం ఈ ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని చూపించారు. ఇప్పుడు ఈ బాధ్యతల్ని పరిటాల శ్రీరామ్ మోయబోతున్నారు.

For All Tech Queries Please Click Here..!