పకడ్బందీగా రీపోలింగ్‌ చేస్తాం అంటున్న ఈసీ.

Friday, April 19, 2019 10:00 AM Politics
పకడ్బందీగా రీపోలింగ్‌ చేస్తాం అంటున్న ఈసీ.

రీ పోలింగ్‌ జరుగనున్న కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ఆదేశించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఐదు బూత్‌ల్లో రీ పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో నాలుగు జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రీ పోలింగ్‌కు దారితీసిన కారణాలను ఠాకూర్‌ అడిగి తెలుసుకున్నారు. కేవలం ఎన్నికల అధికారుల వల్లే రీ పోలింగ్‌కు దారి తీసినట్లు ఎస్పీలు వివరించారు. గుంటూరు నగరంలోని నల్లచెరువు 25వ లైన్‌లో గల 244వ పోలింగ్‌ బూత్‌లో పోలింగ్‌ అధికారి (పీవో) ముందుగానే స్లిప్‌లు జారీ చేయడంతో గందరగోళం నెలకొని వివాదం చోటు చేసుకుందని, దీంతో రిటర్నింగ్‌ అధికారి పోలింగ్‌ను నిలిపివేశారని అర్బన్‌ ఎస్పీ విజయరావు తెలిపారు.

నరసరావుపేట పరిధిలోని కేశా నుపల్లిలో గల 94వ నెంబరు పోలింగ్‌ బూత్‌లో మాక్‌పోలింగ్‌ నిర్వహించిన అనంతరం ఈవీఎంను రీఫ్రెష్‌ చేయకుండా అధికారి అదేవిధంగా కొనసాగించడంతో సమస్య వచ్చిందని రూరల్‌ ఎస్పీ రాజ శేఖర్‌బాబు వివరించారు. ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్‌ బూత్‌లో ఆలస్యం కారణంగా, నెల్లూరు జిల్లాలో మాక్‌పోలింగ్‌ విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి కారణాల వల్లే రీపోలింగ్‌ అనివార్య మయ్యిందని ఆయా జిల్లాల ఎస్పీలు సిద్దార్థ కౌసిగి, ఐశ్వర్యరస్తోగి డీజీపీకి వివరించారు. డీజీపీ ఠాకూర్‌ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ఒక బూత్‌లోనే రీ పోలింగ్‌ జరుగు తున్న నేపథ్యంలో ఆయా అభ్యర్ధులంతా బూత్‌లోకి వస్తారని, మరో వైపు ఏజెంట్లు కూడా ఉంటారని, దీంతో పోలింగ్‌ బూత్‌ రద్దీగా మారుతుందన్నారు. గుంటూరు వెస్ట్‌లో ఏకంగా 34 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్న నేపథ్యంలో రీ పోలింగ్‌ సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

For All Tech Queries Please Click Here..!