మూడు నగరాలకు తప్పిన ఉగ్ర పేలుళ్ల ముప్పు
దేశంలోని మూడు నగరాలకు ఉగ్రవాదుల నుంచి పేలుళ్ల ముప్పు తప్పింది. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో మారుపేర్లతో సాధారణ జనంలో కలిసిపోయిన ఇద్దరు అల్ ఉమా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అరెస్టు చేయడంతో ఆ కుట్ర బయటపడింది. వారిద్దరి భార్యలను కూడా పోలీసులు వేర్వేరు చోట్ల అరెస్టు చేశారు. వారి ఇళ్ళ నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
అందులో సూట్ కేసు బాంబులు, మూడు నగరాల నెట్ వర్క్ మ్యాపులు లభించడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. ఆ ఇళ్ల నుంచి 50 ఐఈడీలు తయారు చేయడానికి అవసరమైనంత పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన వరసకు సోదరులైన అల్ ఉమా తీవ్రవాదులు అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీని రెండు రోజుల కిందట రాయచోటిలో స్థానిక పోలీసుల సహకారంతో తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
1999 నుంచి బాంబు పేలుళ్ల కేసుల్లో పరారీలో ఉన్న వారిద్దరు 20 ఏళ్లుగా మారుపేర్లతో రాయచోటి పట్టణంలో అబూ బకర్ సిద్ధిక్ -అమానుల్లాగా, మహమ్మద్ అలీ – మంసూర్ పేరుతో నివసిస్తున్నారు. వారి అరెస్టు తరువాత అన్నమయ్య జిల్లా పోలీసులు గురువారం సిద్ధిక్ భార్య, షేక్ సైరాభాను, మహ్మద్ అలీ భార్య షేక్ షమీమ్ ను కూడా అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరచగా, వారిద్దరిని కడప సెంట్రల్ జైలుకు రిమాండ్ కు తరలించారు. అరెస్టు చేసే సమయంలో ఆ మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైందని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు.



