నమాజ్ కోసం బస్సు ఆపిన డ్రైవర్.. సస్పెండ్ చేసిన అధికారులు

నమాజ్ చేయడానికి బస్సును మార్గం మధ్యలో ఆపిన డ్రైవర్ కమ్ కండక్టర్ ను ఆర్టీసీ సస్పెండ్ చేసింది. ఈ ఘటన కర్ణాటకలో ఏప్రిల్ 29న హుబ్బళ్లి నుంచి హవేరికి వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ నమాజ్ పూర్తయ్యే వరకు ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనను ప్రయాణీకులలో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూనిఫాం ధరించిన ఆర్టీసీ డ్రైవర్ బస్సు లోపల సీటుపై నమాజ్ చేస్తునట్లు విడియోలో కనిపిస్తోంది.
మతపరమైన కార్యకలాపాలకు కోసం అధికారిక విధులను ఉపయోగించడంపై విమర్శలకు దారితీసింది. కర్ణాటక రవాణా శాఖ వెంటనే దీనిపై స్పందించింది. రవాణా మంత్రి రామలింగారెడ్డి బస్సు డ్రైవర్ పై విచారణకు ఆదేశించారు. ఉద్యోగి సేవా నియమాలను ఉల్లంఘించినట్లు తేలితే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విచారణ ముగిసే వరకు డ్రైవర్‌ను సస్పెన్షన్‌లో ఉంచినట్లు శాఖ పేర్కొంది. "ప్రజా సేవలో పనిచేసే సిబ్బంది కొన్ని నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రతి ఒక్కరికీ ఏ మతాన్ని అయినా ఆచరించే హక్కు ఉన్నప్పటికీ పని సమయాల్లో అలా చేయరాదు.బస్సును మధ్యలో ఆపి మరి నమాజ్ చేయడం అభ్యంతరకరం" అని మంత్రి రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హుబ్బళ్లిలో ప్రధాన కార్యాలయం ఉన్న నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC) మేనేజింగ్ డైరెక్టర్‌ను కూడా ఆయన ఆదేశించారు.