రష్యా ప్రియురాలి కోసం కర్ణాటకకు ఇజ్రాయెల్ ప్రియుడు
కర్ణాటకలోని గోకర్ణ సమీప అడవిలోని గుహలో రహస్యంగా నివసించిన రష్యా మహిళ నీనా కుటినా తన ప్రేయసి అని ఇజ్రాయెల్ నుంచి డ్రోర్ గోల్డ్ స్టెనిన్ అనే వ్యక్తి గురువారం బెంగళూరు వచ్చారు. ఆమెతో మాట్లాడేందుకు పోలీసుల సాయం కోరారు. వారికి సంబంధించిన పలు వివరాలు వెల్లడించారు.
గోవాలో ఇద్దరం ఒకే కంపెనీలో పని చేశామని, అప్పుడే ప్రేమించుకున్నామని, ఇద్దరు కుమార్తెలు జన్మించిన అనంతరం కూడా కలిసే ఉన్నామని తెలిపారు. గతేడాది పనిపై ఇజ్రాయెల్ వెళ్లానని, తరచూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లమని, ఉన్నట్లుండి మార్చి నుంచి నీనా ఫోన్కు స్పందించడం మానేశారని , ఈ విషయంపై పణజీ పోలీసులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. ఇటీవల గుహలో రహస్యంగా ఉన్న ఆమెను, పిల్లల్ని పోలీసులు రక్షించారని తెలిసి వెంటనే ఇక్కడికి వచ్చారని పోలీసులకు చెప్పారు. ఆమెకు కుటుంబ నిర్వహణకు ప్రతి నెలా రూ.3.5 లక్షలు పంపుతున్నానని తెలిపారు. ఆమె తరచూ ప్రకృతి మధ్యలోనే పిల్లలను పెంచాలనేదని అందుకే అడవిలోకి వెళ్లి ఉండొచ్చని అన్నారు. ఆమె తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఏళ్లుగా గుహలో నివసిస్తుండగా అక్కడ గస్తీ నిర్వహించిన పోలీసులు వీరిని గమనించారు. విషపూరిత పాములు, మృగాలతో పాటు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ఆ ప్రాంతం నుంచి వారిని తరలించారు.

.jpg)
.jpg)
.jpg)