గోరంట్ల మాధవ్ నామినేషన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Monday, March 25, 2019 06:05 PM News
గోరంట్ల మాధవ్ నామినేషన్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఇన్నాళ్లూ ట్విస్టుల మీద ట్విస్టులతో తీవ్ర ఉత్కంఠతకు గురి చేసిన గోరంట్ల మాధవ్ నామినేషన్ ఉదంతానికి హైకోర్ట్ పులిస్టాప్ పెటింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదివరకు అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవాలి అంటూ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ను కొట్టి పడేసింది. దీనితో గోరంట్ల మాధవ్ నామినేషన్ ను ఎన్నికల కమిషన్ స్వీకరించడం ఖాయం.

గోరంట్ల మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా జోక్యం చేసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ ను వెంటనే ఆమోదించి ఉద్యోగం నుంచి రిలీవ్‌ చేయాలంటూ ఇదివరకే రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. అయినప్పటికీ, డీజీపీ దీన్ని పట్టించుకోలేదు. స్వయంగా ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలను కూడా డీజీపీ పెడచెవిన పెట్టారు. మాధవ్ వీఆర్ఎస్ ను ఆమోదిస్తూ సంబంధిత పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు రాలేదు. దీనితో మాధవ్ హైకోర్టును ఆశ్రయించారు. తన వీఆర్ఎస్ ఆమోదాన్ని వెంటనే ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని విన్నవించారు. దీనికి రాష్ట్ర పోలీసు శాఖ కౌంటర్ వేసింది, మాధవ్ పై రెండు చార్జి షీట్లు పెండింగ్‌లో ఉన్నాయని, అందుకే ఆయనను రిలీవ్ చేయటం కుదరదని పోలీసు శాఖ హైకోర్టులో చెపింది. అక్కడితో ఆగలేదు, ఇదివరకు ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా న్యాయస్థానాన్ని కోరింది. ఇప్పట్లో రిలీవ్ అయ్యే అవకాశం లేకపోవటంతో గోరంట్ల మాధవ్ ఎన్నికల్లో పోటీపై ఆశలు వదులుకున్నారు. తన భార్య సవిత పేరును తెరమీదికి తెచ్చారు. ఒకవేళ మాధవ్ నామినేషన్ వేయలేకపోతే, సవితకు టికెట్ ఇస్తామని వైఎస్ జగన్ కూడా ప్రకటించారు.

ప్రభుత్వం వేసిన పిటీషన్, గోరంట్ల మాధవ్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సోమవారం తన తీర్పును వెలువడించింది. వీఆర్ఎస్ తీసుకోవడానికి అవసరమైన అన్ని అర్హతలు గోరంట్ల మాధవ్ కు ఉన్నాయని స్పష్టం చేసింది. గోరంట్ల మాధవ్ ను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించడంతో పాటు ఆయన నామినేషన్ స్వీకరించాలని సూచించింది. ప్రభుత్వం వేసిన స్టే పిటీషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. నామినేషన్ వేసుకోవచ్చని స్పష్టం చేసింది.
 

For All Tech Queries Please Click Here..!