పాకిస్తాన్ లో మొదలైన భయం.. మరో 36 గంటల్లో..

ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది పర్యాటకులను అమానుషంగా ఉగ్రవాదులు కాల్చి చంపిన నాటి నుంచి భారత్, పాక్ మధ్య చిచ్చు మొదలైన విషయం తెలిసిందే. ఈ కుట్రకు పాకిస్థాన్ అండదండలు ఉన్నాయనేందుకు స్పష్టమైన ఆధారాలు లభించాయని నిఘా వర్గాలు బయటపెట్టాయి. దీంతో ఇండియా ఎప్పుడు ప్రతీకార చర్యలకు దిగుతుందనే అనే భయం పాక్ లో మొదలైంది.
అయినా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మాత్రం మానుకోవడం లేదు. తాజాగా, పాకిస్థాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ న్యూఢిల్లీకి హెచ్చరికలు చేశారు. పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ మాట్లాడుతూ, భారత్ రాబోయే 24 నుంచి 36 గంటల్లో సైనిక దాడికి ప్రణాళికలు రచిస్తోందని తమ నిఘా వర్గాలు హెచ్చరించాయని పేర్కొన్నాడు. అలాగే పహల్గాం ఘటనలో పాక్ ప్రమేయం ఉందని న్యూఢిల్లీ కల్పిత, నిరాధార ఆరోపణలు చేస్తోందని, సైనిక దురాక్రమణ చర్యలకు పాల్పడేందుకే ఈ వాదనలు చేస్తోందని ఆరోపించారు. పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనని భారత్ చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామని నొక్కి చెప్పారు. ఇస్లామాబాద్ తటస్థ నిపుణుల కమిషన్ ద్వారా విశ్వసనీయమైన, పారదర్శక దర్యాప్తుకు సహకరిస్తామని చెప్పినా భారతదేశం ఘర్షణ మార్గం ఎంచుకుంటోందని అన్నారు. ఒకవేళ తమ దేశంపై సైనిక చర్యలకు దిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రక్షణ అధికారులతో ప్రధాని మోదీ సమావేశమైన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.
భారత్ సైనిక దాడి చేస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యంలో అలజడి మొదలైంది. పహల్గామ్ దాడి తర్వాత దాదాపు 5,000 మంది సైనికులు, అధికారులు పాక్ సైన్యాన్ని విడిచిపెట్టారు. లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ అహ్మద్ బుఖారీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు రాసిన లేఖలోని సమాచారం ప్రకారం, గత 72 గంటల్లో 250 మంది అధికారులతో సహా 1,450 మంది సైనికులు రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామాలు చేసినవారిలో 12వ కార్ప్స్ క్వెట్టా నుంచి 520 మంది, ఫోర్స్ కమాండ్ నార్తర్న్ ఏరియాస్ నుంచి 380 మంది, ఫస్ట్ కార్ప్స్ మంగ్లా నుంచి 550 మంది ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే పహల్గాం దాడి హంతకులను, సహకరించిన వారిని ఎక్కడున్న పట్టుకుని కచ్చితంగా శిక్షించి తీరతామని ప్రధానమంత్రి మోదీ ప్రతిజ్ఞ చేసారు. పాక్ హస్తం ఉందనేందుకు బలమైన సాక్ష్యాధారాలు లభించడంతో ఇప్పటికే సింధు జలాల ఒప్పందం, పాక్ పౌరుల దేశ బహిష్కరణ, వీసాల రద్దు వంటి చర్యలను భారత ప్రభుత్వం చేపట్టింది. దౌత్యపరంగానూ ఇస్లామాబాద్ పై న్యూఢిల్లీ ఒత్తిడి తెస్తుండటంతో దాయాది దేశం భయపడుతూనే అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది. మరో పక్క చూస్తేనేమో యుద్ధం భయంతో సైన్యం, అధికారులు వరసగా రాజీనామాలు చేస్తున్నారు.