హైదరాబాద్ వేదికగా కిడ్నీల వ్యాపారం..

Monday, April 1, 2019 10:00 AM News
హైదరాబాద్ వేదికగా కిడ్నీల వ్యాపారం..

విదేశాలకు తీసుకువెళ్లి కిడ్నీలను కాజేస్తున్న అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు, కిడ్నీ దానం చేస్తే రూ.20లక్షలు వస్తాయని చెప్పి ఇలా చేస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ దందా ఓ బాధితుడిని నిండా ముంచింది. కిడ్నీని కాజేసిన దుండగులు అతనికి ఇస్తానన్న సొమ్ము ఇవ్వకుండా అతన్ని మోసం చేశారు. ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కుతాయని భావించి కిడ్నీ దానానికి సిద్ధపడ్డ బాధితుడి ఫిర్యాదుతో రాచకొండ పోలీసులు గత కొన్ని నెలలుగా ప్రత్యేక దృష్టిసారించారు.

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన గంప రాజు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. అతని ఫేస్‌బుక్ ఖాతాకు గత ఏడాది జూన్ నెలలో ఉత్తరప్రదేశ్ మీరట్ పట్టణానికి చెందిన సందీప్ దక్ష్ అలియాస్ రోహన్ మల్లిక్ ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చింది. ఆ రిక్వెస్టును స్వీకరించిన తర్వాత అతనికి సందీప్ తన స్నేహితుడు గగన్ అగర్వాల్‌కు కిడ్నీ కావాలని, ఎవరైనా ఇస్తే రూ.20 లక్షలు చెల్లిస్తారని చెప్పాడు. అంగీకరిస్తే వెంటనే పంపిన లింక్‌లో వివరాలు వెల్లడించాలని చెప్పాడు. దీంతో రాజు ఆ లింక్‌ను తెరిచి మొత్తం వివరాలను వెల్లడించాడు. వీటిని పరిశీలించిన సందీప్ ఆ తర్వాత ప్రతి విషయాన్ని వాట్సాప్ చాటింగ్, వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడారు. వైద్య పరీక్షల కోసం ఢిల్లీకి రావాలని పిలిపించాడు. ఢిల్లీకి సంబంధించిన వైద్య ఖర్చులతో పాటు ప్రయాణ ఖర్చులను సందీప్ పెట్టుకున్నాడు. ఢిల్లీకి వెళ్లిన రాజుకు నోయిడాలోని ఓ హోటల్‌లో బస కల్పించారు.

టర్కీలో ఇజ్‌మీర్ పట్టణంలో రాజుకు ఇండియాకు చెందిన అమ్మిష్ ప్రతాప్ సిసోడియా, టర్కీ దేశానికి చెందిన దీనా పరిచయమయ్యారు. అక్కడ ఓ అపార్ట్‌మెంట్‌లో బస కల్పించి మరోసారి ఇజ్‌మీర్ పట్టణంలోని కెంట్ దవాఖానాలో వైద్య పరీక్షలను చేయించారు. ఆగస్టు 27న రాజు రూ.20 లక్షలు ఇస్తేనే కిడ్నీ ఇస్తానని పట్టుబట్టాడు. దీంతో అమ్రిష్ ప్రతాప్ సిసోడియా ఇంకా మరికొందరు రాజు పాసుపోర్టు, వీసాలను లాగేసుకుని బెదిరించి కిడ్నీ ఇవ్వకపోతే నీవు తిరిగి ఇండియాకు వెళ్లలేవు, ఇక్కడే చంపేస్తామని బెదిరించి భయపెట్టించారు. ఆ తర్వాత బలవంతంగా రాజుకు వైద్య చికిత్సలను నిర్వహించి ఎడమ వైపు కిడ్నీని తీసేసి గగన్ అగర్వాల్‌కు అమర్చారు. కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యపరంగా కోలుకున్న తర్వాత రాజు తిరిగి ఇండియాకు వచ్చాడు. ఈ విషయంపై రాచకొండ పోలీసులకు అతనికి జరిగిన మోసంపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశాడు.

For All Tech Queries Please Click Here..!