యోగాంధ్ర వరల్డ్ రికార్డుకు సిద్దం.. భారీ ఏర్పాట్లు
విశాఖపట్నంలో శనివారం నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో పాటు 175 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. బీచ్ రోడ్డు వద్ద జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ యోగా దినోత్సవం సదంర్భంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రపంచ రికార్డు స్థాయిలో జరుగుతుందని, విశాఖ నుంచి భీమిలి వరకూ 29.8 కి.మీ. పొడవున కార్యక్రమం నిర్వహిస్తామని, ఒక్క బీచ్ రోడ్డులోనే 3.26 లక్షల మంది పాల్గొంటారని చెప్పారు. ఇంకా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం ఐదు లక్షల మంది అవుతారన్నారు. వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయేలాగా సీఎం చంద్రబాబు ప్రణాళిక చేస్తున్నారని తెలిపారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయండని ఆయన పిలుపునిచ్చారు.



