ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
బనకచర్ల వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో నిర్వహిస్తోన్న 'సుపరిపాలన-తొలి అడుగు' సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతోపాటు ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. సుపరిపాలన అందించేందుకు అధికారులు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
సమాజంలో ఆర్థిక అసమానతలు భారీగా పెరుగుతున్నాయని, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారని , ధనవంతులు ఇంకా ఇంకా ధనికులుగా మారిపోతున్నారని చంద్రబాబు తెలిపారు. గ్రామాల్లో మనతో పుట్టినవాళ్లు ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారన్నారు. అలాంటి వారికి సమాజం అండగా నిలబడాలని ఆకాక్షించారు. బిల్ గేట్స్ తాను సంపాదించిన దాంట్లో 99 శాతం డబ్బులు సమాజానికే ఇస్తున్నారని చంద్రబాబు చెప్పారు. పేదలకు ప్రతి ఒక్కరు సాయం చేయాలని, అప్పుడే వాళ్లు కూడా ఆర్థికంగా పైకి వస్తారన్నారు. పేదలను ఆదుకునేందుకే పీ-4ను తీసుకొచ్చామని, ఇందులో ధనికులు, పారిశ్రామిక వేత్తలు, అధికారులు కూడా భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి చాలా రకాల రాయితీలు ఇస్తున్నామని, వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2.6 లక్షలుగా ఉందని, 2047కు రూ.55 లక్షలకు పెరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.



