తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పేరుతో మరో సర్వే..

Wednesday, April 3, 2019 10:38 AM News
తెలంగాణ ఇంటెలిజెన్స్‌ పేరుతో మరో సర్వే..

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీదే విజయం ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు సర్వే కథనాన్ని ప్రచురించిన సంగతి మనకు తెలిసిందే అదే తరహాలో ఏపీ ప్రజలను బురిడీ కొట్టించేందుకు మరో ప్రయత్నం జరిగింది. ఏపీలో ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగం సర్వే నిర్వహించారని, అందులో టీడీపీ భారీ ఆధిక్యంతో గెలుస్తున్నట్టుగా తేలిందంటూ యూట్యూబ్‌లో హైదరాబాద్‌కు చెందిన టీఎఫ్‌సీ మీడియా అనే ప్రైవేటు కంపెనీ ఈ సర్వేను ప్రసారం చేసింది. దీన్ని గుర్తించిన తెలంగాణ ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ హరిప్రసాద్‌ టీఎఫ్‌సీ మీడియాపైన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై తాము ఎలాంటి సర్వే నిర్వహించలేదని, వారి ప్రచారానికి తమ శాఖ పేరును వాడుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఈ కంపెనీ డైరెక్టర్లపై ఐటీ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో టీడీపీ అనుకూలవాదుల మరో ఎత్తుగడ బట్టబయలైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తెలంగాణ ఇంటెలిజెన్స్‌ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె.హరిప్రసాద్‌ హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని వెస్ట్‌జోన్‌ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఆయన యూట్యూబ్‌ను బ్రౌస్‌చేస్తుండగా అందులో టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్‌ టిమిటెడ్‌ అనే సంస్థ అప్‌లోడ్‌ చేసిన ఓ సర్వే ఆయన కంటపడింది. ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ సర్వే చేసిందని, టీడీపీ భారీ ఆధిక్యంతో గెలవనుందన్న విషయం సర్వేలో వెల్లడైందని ఈ కథనంలో ఉంది. దీనిపై హరిప్రసాద్‌ తమ డిపార్ట్‌మెంట్‌లో ఆరా తీయగా ఏపీ ఎన్నికపై తెలంగాణ నిఘా విభాగం ఎలాంటి సర్వేలు నిర్వహించలేదని తేలింది. దీంతో ఈ బోగస్‌ వార్త విషయాన్ని హరిప్రసాద్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.

For All Tech Queries Please Click Here..!