రెండో దశలో 68% పోలింగ్‌ నమోదు..

Friday, April 19, 2019 07:40 AM News
రెండో దశలో 68% పోలింగ్‌ నమోదు..

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న 95 లోక్‌సభ నియోజకవర్గాలకు గురువారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో 67.84% ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల కమిషన్‌ తెలిపింది. పశ్చిమబెంగాల్, మణిపూర్‌లలో హింసాత్మక ఘటనలు, ఈవీఎంలలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా పోలింగ్‌కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. గురువారం తమిళనాడులోని 38, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, యూపీ, అస్సాం, బిహార్, ఒడిశాలలో ఐదేసి సీట్లు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లో మూడు చొప్పున, జమ్మూకశ్మీర్‌లో రెండు, మణిపూర్, పుదుచ్చేరిల్లో ఒక్కొక్క లోక్‌సభ స్థానం, ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరిగాయి. వీటితోపాటు తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో పుదుచ్చేరిలో అత్యధికంగా 80%, మణిపూర్‌లో 75% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.

కశ్మీర్‌లో వేర్పాటువాదులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపు ఇచ్చిన నేపథ్యంలో శ్రీనగర్‌లో అత్యల్పంగా 14.8% పోలింగ్‌ నమోదైంది. శ్రీనగర్‌ పార్లమెంటరీ స్థానంలోని 90 పోలింగ్‌ బూత్‌లతో ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఉథంపూర్‌లో మాత్రం 70% పోలింగ్‌ నమోదైంది.

For All Tech Queries Please Click Here..!