ప్యాకెట్ పాలు వేడి చేయాలా? వద్దా?
_(17)-1745716287.jpeg)
పాలు తాగే ముందు వేడి చేయడం ఎన్నో తరాలుగా వస్తున్న అలవాటు. కానీ ప్యాకెట్ పాలు ఇలా వేడి చేయడం వల్ల కొన్ని నష్టాలు తప్పవు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒకప్పుడు పాడి రైతులు పాలు పిండి నేరుగా ఇంటికి వచ్చి పోసే వాళ్లు. ఈ పాలలో బ్యాక్టీరియా ఉంటుంది. ఈ పాలను నేరుగా తీసుకుంటే జబ్బులు వస్తాయి. అంతే కాదు. వాతావరణంలో మార్పులు వచ్చే కొద్దీ ఈ పాలలోనూ మార్పులు వచ్చేవి. అప్పట్లో వీటిని సరైన విధంగా స్టోర్ చేసే సౌకర్యాలు కూడా లేవు. అందుకే అప్పట్లో ఆ పాలను వేడి చేయడం అనే అలవాటు మొదలైంది. అదే అలవాటై ప్యాకెట్ పాలనూ వేడి చేసి తాగుతున్నారు. కానీ ప్యాకెట్ పాలను వేడి చేయాల్సిన అవసరం లేదు. దీని వెనక పలు కారణాలు ఉన్నాయి.
ప్యాకెట్ పాలను వేడి చేయాల్సిన అవసరం లేదు. ఈ పాలను ముందుగానే ఫ్యాక్టరీలలో అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద వేడి చేస్తారు. దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. అంత టెంపరేచర్ లో వేడి చేసినప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. ఇలా బాయిల్ చేసినప్పుడు పాలల్లో మార్పులు వస్తాయి. వైరస్ లు కూడా చనిపోతాయి కాబట్టి వాటిని నేరుగా తీసుకున్నా ఎలాంటి ప్రమాదం ఉండదు. పాలల్లో ఉండే హెవీ ప్రోటీన్ కూడా తగ్గిపోతుంది. ఫలితంగా తాగిన వెంటనే సులువుగా జీర్ణమవుతుంది. కొవ్వు శాతం తగ్గిపోయి ఇందులో ఉండే లాక్టోస్ పాలకు తియ్యదనాన్ని అందిస్తుంది. పైన ఓ క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది.
పాల ప్యాకెట్లు డ్యామేజ్ అయినా, వాటిని సరైన విధంగా స్టోర్ చేయకపోయినా వేడి చేయడం మంచిదే. కానీ మరీ అతిగా వేడి చేయడం వల్ల చెడు బ్యాక్టీరియాతో పాటు అందులో ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. ఈ పాలు తాగినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ బి లాంటి పోషకాలు పోతాయి. అప్పటికీ ఈ పాలను వేడి చేయాలనుకుంటే చాలా తక్కువ టెంపరేచర్ లో చేయాలి. సరిగ్గా తాగే ముందు కాస్తంత గోరువెచ్చగా చేసుకుని తాగితే సరిపోతుంది. నాలుగైదు నిముషాల పాటు వేడి చేసి తాగితే అందులో ఉండే పోషకాలు అలాగే ఉంటాయి. పాశ్చురైజ్ చేసిన పాలను సరైన టెంపరేచర్ వద్ద స్టోర్ చేయాల్సి ఉంటుంది. అంటే వాటిని ప్యాక్ చేసినప్పటి నుంచి మనం కొనుక్కోనే వరకూ అవి పాడు కాకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ ఈ టెంపరేచర్ లో ఏమైనా మార్పులు వస్తే ఆ పాలు ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. అయితే ఆవు, గేదె పాలను ఓ మోతాదులో వేడి చేసినా సరిపోతుంది. ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలను మాత్రం మరీ ఎక్కువగా వేడి చేయకూడదు. మరీ అతిగా వేడి చేస్తే ప్రోటీన్ తగ్గిపోతుంది.