పందెం వేసి నీళ్ళు కలపకుండా ఐదు బాటిళ్ల మద్యం తాగాడు.. చివరికి

ఫ్రెండ్స్ మధ్య జరిగిన ఓ టైమ్ పాస్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో 21 ఏళ్ల యువకుడు రూ.10,000 పందెం కోసం ఐదు మద్యం బాటిళ్లు తాగి మరణించిన ఘటన ఆ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నీరు కలపకుండా మద్యం తాగడం వల్ల అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కోలార్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల కార్తీక్ స్నేహితులతో కలిసి సరదాగా రూ.10వేలు పందెం వేశాడు. అతను మద్యంలో నీటిని కలపకుండా నేరుగా 5 బాటిళ్లు తాగుతానని చెప్పాడు. వెంకట రెడ్డి అనే స్నేహితుడు కార్తీక్ అలా మద్యం తాగితే రూ.10,000 ఇస్తానని ఆఫర్ చేశాడు. అలా నీరు కలపకుండా 5 బాటిళ్ల మద్యం తాగాడు. ఆ తర్వాత అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కార్తీక్ ను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కార్తీక్ శరీరం చికిత్సకు స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే మరణించాడు. నీరు కలపకుండా అతిగా మద్యం తాగడం వల్ల అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కార్తీక్ కు ఏడాది క్రితమే పెళ్లి జరిగినట్లు సమాచారం. కార్తీక్ భార్య ప్రెగ్నెంట్ కావడంతో ఆమె వాళ్ల తల్లి వద్దకు పంపించాడు. ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు. ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చిన భార్య 8 రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు అతడి భార్య చిన్న వయసులోనే భర్తను కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరుమున్నీరు అయ్యారు.