ఇద్దరు కొడుకులను నరికి చంపిన తల్లి.. ఆపై తాను కూడా..

క్షణికావేశంతో తన ఇద్దరు కొడుకులను దారుణంగా నరికి చంపింది ఓ తల్లి. ఈ దారుణ సంఘటన మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో చోటుచేసుకుంది. జీడిమెట్లలో నివసిస్తున్న ఓ మహిళ 9, 11 సంవత్సరాల వయసున్న తన ఇద్దరు కుమారులను కొడవలితో దారుణంగా నరికి చంపింది. అనంతరం భవనం పైనుంచి దూకి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. తల్లి తేజ (35) తన ఇద్దరు పిల్లలు హర్షిత్ రెడ్డి (11), ఆశిష్ రెడ్డి (9)లను నరికి చంపినట్లు తెలిపారు. అనంతరం తాను కూడా బాలాజీ లే అవుట్‌లోని అపార్ట్‌మెంట్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. పెద్ద కుమారుడు, తేజ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోగా.. చిన్న కుమారుడు ఆశిష్ రెడ్డిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయినట్లు తెలిపారు. కాగా, మృతురాలి ఇంట్లో ఆరు పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.