తల్లీ కూతుళ్ళ ప్రాణం తీసిన కూలర్

ఇంట్లో అమర్చిన కూలర్ కరెంట్ షాక్ కొట్టి తల్లి, కూతురు దుర్మరణం పాలైన విషాదకర ఘటన కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం గుల్లా తండాలో చోటుచేసుకుంది. గుల్లా తండాకు చెందిన ప్రహ్లాద్‌కు భార్య శాంకబాయి, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె హైదరాబాద్‌లో చదువుకుంటోంది. ప్రహ్లాద్ శుక్రవారం(మే 08) రాత్రి పని మీద హైదరాబాద్ వెళ్లారు. భార్య శాంకబాయి (36), చిన్న కుమార్తె శ్రీవాణి (12), కుమారుడు (16) ఇంట్లో నిద్రిస్తున్నారు. ఎండల వేడిమి తట్టుకోలేక, శాంకబాయి పిల్లల కోసం కూలర్ ఆన్ చేసి పడుకుంది.
ఇదే సమయంలో ముందుగా చిన్న కూతురు శ్రీవాణి కాలు కూలర్‌కు తాకింది. దీంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురైంది. కరెంట్ షాక్ తీవ్రతతో ఆమె కాలి వేళ్లు కాలిపోయాయి. అయితే, పక్కనే ఉన్న తల్లి శాంకబాయిని కుమార్తె భయంతో గట్టిగా పట్టుకోవడంతో ఇద్దరు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో నిద్రలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కొంచెం దూరంగా నిద్రపోయిన కుమారుడు ఉదయం నిద్ర లేచి చూసేసరికి తల్లి, చెల్లి ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూసేసరికి ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మద్నూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుదాఘాతానికి కారణమైన కూలర్ ఇనుముది కావడం, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా స్థానికంగా తయారీ కావడంతోనే షాక్ తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా తండాలోని ఇళ్లల్లో కరెంట్ షాక్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏకంగా రెండు ప్రాణాలే పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్తుశాఖ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ ఎఈ పరిశీలించారు.