హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదాలు, ఎనిమిది మంది మృతి
Hyderabad, Dec 13: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదాలు (Hyderabad Road Accidents) చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో గచ్చిబౌలిలో టిప్పర్‌ను కారు ఢీకొనడంతో ఐదుగురు మృతి చెందారు. వారిలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతులు సంతోష్(25), మనోహర్(22), భరద్వాజ్(20), మాదాపుర్ అయ్యప్ప సొసైటీకి చెందినవారుగా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
మరోవైపు, పటాన్‌చెరు, కూకట్‌పల్లిలోనూ ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పటాన్‌చెరులోని ముత్తంగి దగ్గర కంటైనర్‌ను ఓ బైక్ ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు సంగారెడ్డి జిల్లా మృతులు రుద్రారానికి చెందిన రాజు, ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు. నగరంలోని కూకట్‌పల్లిలో ఓ బైక్‌ను లారీ ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు.
ఇక తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మపురి-సేలం రహదారిపై వేగంగా వెళ్తున్న సిమెంట్ ట్రైలర్ వాహనం ఓ భారీ కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో వెనుక వేగంగా వస్తున్న 8 వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 10 మందికి గాయాలయ్యాయి. పలు కార్లు ధ్వంసమయ్యాయి.